![RBI Monetary Policy: Reserve Bank of India Keeps Interest Rate, Repo Rate Unchanged - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/7/RBI-GOVERNOR122.jpg.webp?itok=Tad9bnWh)
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్టే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి వృద్ధికి మద్దతు పలికింది. ద్రవ్యోల్బణం సమీప కాలంలో ఎగువ స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తూ.. అదే సమయంలో కీలకమైన రెపో రేటు (4 శాతం), రివర్స్ రెపో రేటు (3.35 శాతం)ను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాల్లోనూ మార్పులు చేయలేదు. వృద్ధికి మద్దతుగా సర్దుబాటు ధోరణినే కొనసాగించడం శుక్రవారం ముగిసిన మూడో ద్వైమాసిక (2021–22లో) ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలుగా చెప్పుకోవాలి.
ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు, వృద్ధి స్థిరపడే వరకు సర్దుబాటు విధానం కొనసాగింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఐదుగురు ఆమోదం తెలిపినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. గతంలో ఏకగ్రీవ ఆమోదం రాగా.. ఈ విడత ఒక్కరు దీంతో విభేదించడం గమనార్హం. సమీప కాలంలో రేట్లను పెంచే అవకాశం లేదని దీంతో తెలుస్తోంది. ఆర్‌బీఐ కీలక రేట్లను యథావిధిగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో విడత. చివరిగా 2020 మే నెలలో రేట్లను సవరించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అప్పుడు కీలక రేట్లను అత్యంత కనిష్టాలకు తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి నుంచి 2020 మే నాటికి మొత్తం మీద 2.5 శాతం మేర రేట్లను తగ్గించింది.
సదా సన్నద్ధంగానే ఉంటాం..
కరోనా మరో విడత విరుచుకుపడే ప్రమాదంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అప్రమత్తత ప్రకటించారు. ‘‘ఆయుధాలను విడిచి పెట్టకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో విడత పట్ల అప్రమత్తంగా ఉంటాం’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైందంటూ.. ఈ కీలక సమయంలో ద్రవ్యపరమైన, విధానపరమైన, రంగాల వారీ మద్దతు కొనసాగాల్సిన అవసరాన్ని దాస్ ప్రస్తావించారు. కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైందంటూ.. పెట్టుబడులు, డిమాండ్ కోలుకోవడాన్ని కీలక గణాంకాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ ఎంపీసీ 2021–22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 9.5 శాతంగానే కొనసాగించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 21.4 శాతం, జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో 7.3 శాతం, ఆ తర్వాతి త్రైమాసికంలో 6.3 శాతం, చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) 6.1 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధి నమోదవుతుందన్న అభిప్రాయాన్ని తెలియజేసింది. వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి, అటు గృహ కొనుగోలు దారులకు మేలు చేసినట్టు దాస్ పేర్కొన్నారు.
ఎంపీసీ ఇతర నిర్ణయాలు
► కరోనా కారణంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రంగానికి ఊరట లభించింది. రుణ పునరుద్ధరణ పథకానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ నిర్దేశించిన పలు నిబంధనల అమలుకు గడువును మరో ఆరు నెలలు అంటే 2022 అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది.
► సెకండరీ మార్కెట్లో రూ.50,000 కోట్లతో ప్ర భుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్‌ఏపీ 2.0) ఆగస్ట్ నెలలో రెండు విడతలుగా చేపట్టనున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ లిక్విడిటీ ఉండేలా చూడడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు.
► ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నందున.. ఆన్ ట్యాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్‌టీఆర్‌వో) పథకాన్ని మూడు నెలల పాటు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయించింది.
► వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్‌ఆర్‌ఆర్) ఆక్షన్లను రూ.2.5 లక్షల కోట్లతో ఆగస్ట్ 13న, రూ.3 లక్షల కోట్లతో ఆగస్ట్ 27న, రూ.3.5 లక్ష ల కోట్లతో సెప్టెంబర్ 9న, రూ.4 లక్షల కోట్లతో సెప్టెంబర్ 24న చేపట్టనుంది. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీని సర్దుబాటు చేయనుంది.
గరిష్టాల్లోనే ద్రవ్యోల్బణం
సరఫరా వైపు ఉన్న సమస్యలు, చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం, ముడి సరుకుల వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం.
డిజిటల్ రూపీ
డిజిటల్ రూపాయిని త్వరలో చూసే అవకాశా లున్నాయి. డిజిటల్ కరెన్సీల నిర్వహణ నమూనాను ఈ ఏడాది చివరి నాటికి ప్రకటించే అవకాశాలున్నట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ తెలిపారు. పరిధి, టెక్నాలజీ, పంపిణీ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకు ని ఫియట్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే సాధ్యా సాధ్యాలను ఆర్‌బీఐ అంతర్గతంగా మదింపు వేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment