రుణాల రీ షెడ్యూల్ ఎప్పుడు వర్తిస్తుందో తమ మాస్టర్ సర్క్యులర్‌లో స్పష్టంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు.
* ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టీకరణ
* ఏపీ, తెలంగాణల్లో పంటల దిగుబడి
* 50% కంటే ఎక్కువే ఉంది
* రుణ మాఫీ, రీ షెడ్యూల్‌పై సమాచారం అందలేదు
* రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం
* ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని
ముంబై: రుణాల రీ షెడ్యూల్ ఎప్పుడు వర్తిస్తుందో తమ మాస్టర్ సర్క్యులర్‌లో స్పష్టంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఏదైనా ఒక జిల్లా లేదా ప్రాంతంలో కరువు, తుపాను వంటి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. జిల్లా కలెక్టర్ ఆ మేరకు ప్రకటిస్తారని, అప్పుడు బ్యాంకులు స్వచ్ఛం దంగా రీ-షెడ్యూల్‌కు అవకాశమిస్తాయని తెలిపారు. అలాంటప్పుడు రైతులు చెల్లించని రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా పరిగణించకుండా రీ-షెడ్యూల్ చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని పరోక్షంగా వెల్లడించారు. మంగళవారం ఇక్కడ పరపతి విధాన సమీక్ష అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తే పంటల దిగుబడి 50 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో రీ-షెడ్యూల్ సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఒకవేళ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని ఉంటే వాటి వివరాలను ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా ఆయా ప్రభుత్వాలను కోరామని, కానీ ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
ప్రస్తుతం రీ-షెడ్యూల్‌కు సంబంధించి రెండు రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సకాలంలో చెల్లించేవారికి కాకుండా, చెల్లించకుండా ఎగ్గొట్టేవారికి మేలు చేసే రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరమైనవని, ఇటువంటి పథకాలు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చెల్లించినవారికి నష్టం కలిగించని విధంగా ఈ రుణ మాఫీ పథకం ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కానీ ఇంతవరకు ఆ పథకం వివరాలు తమకు అందలేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు.
ఖరీఫ్ దిగుబడి ఎక్కడ తగ్గిందో నిరూపించండి
ఏపీ ప్రభుత్వానికి ఆర్‌బీఐ సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి ఏ మండలాల్లో తగ్గిందో నిరూపించాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఏపీ ప్రభుత్వానికి సూచిం చింది. గత ఖరీఫ్‌లో రాష్ట్ర అర్థగణాంక శాఖ లెక్కల ప్రకారం పంటల దిగుబడి బాగానే ఉందని, 50 శాతానికి ఎక్కడా దిగుబడి తగ్గిపోలేదని ఆర్‌బీఐ పేర్కొంది. అర్థగణాంక శాఖ లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కలకు ఏమైనా తేడా ఉంటే చెప్పాలని కూడా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచిం చింది. దీనిపై ఏంచేయాలో పాలుపోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క పంటల దిగుబడి బాగుందని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లెక్కలు చెప్తుండగా.. ఇప్పుడవి సరికావని చెప్పడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
ఏదైనా మండలాల వారీగా పంటల దిగుబడి 50 శాతానికి తగ్గిపోయినట్లుంటే గణాం కాలతో నిరూపించాలని ఆర్‌బీఐ సూచించింది. ఇందుకనుగుణంగా కసరత్తు చేసినా ఆ మేరకు ఆర్‌బీఐ అంగీకరించినా రూ. రెండు లేదా మూడు వేల కోట్లకే రుణాల రీషెడ్యూల్ పరిమితమవుతుం దని అధికార యంత్రాంగం భావిస్తోంది. గత ఖరీఫ్‌లో 50% కన్నా పంటల దిగుబడి తగ్గినట్లు నిరూపిస్తూ గణాంకాలను పంపిస్తే గానీ ఆర్‌బీఐ స్పందించదని అధికారులు చెబు తున్నారు. దీంతో రీషెడ్యూల్‌పై ఆశ వదులు కోవాల్సిందేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.