
అది మూర్ఖత్వమే.. కొత్త గవర్నర్‌పై స్వామి వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: విదేశాలతో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ దిగిపోతున్న గవర్నర్ రఘురాం రాజన్ దుయ్యబట్టిన సుబ్రహ్మణ్యస్వామి.. కొత్త గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్ విషయంలో ఒకింత సానుకూల స్పందించారు. కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్ పటేల్‌ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి కొత్త గవర్నర్‌కు బీజేపీ ఎంపీ అయిన స్వామి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నదని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
'ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్3 (రఘురాం రాజన్) మాత్రం భారత్‌లో పుట్టి, అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్‌లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్‌లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు.