ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశ కీలక నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. అయితే ఈ దఫా రేటు పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెపె్టంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతానికి ఎగసింది. విశ్లేషకుల అంచనాలు నిజమైతే ఈ రేటు తాజా పాలసీ సమీక్ష సందర్భంగా 6.50 శాతానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్‌లలో ఇది 6 శాతం దిగువకు చేరడం విశ్లేషకుల తాజా అంచనాల నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment