
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు.