అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు | RBI needs to tailor its actions in tune with dynamic global situation says Governor Shaktikanta Das | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు

Published Sat, Apr 23 2022 6:29 AM | Last Updated on Sat, Apr 23 2022 6:29 AM

RBI needs to tailor its actions in tune with dynamic global situation says Governor Shaktikanta Das - Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్‌ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్‌ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్‌ వెల్లడించింది.  

ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర
కాగా, డి–గ్లోబలైజేషన్‌ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’  అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్‌ తెలిపాయి.  

మినిట్స్‌ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు
► భారత్‌ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం  తీవ్రంగా ఉంటుంది.
► ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్‌.  
► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్‌. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా.  
► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ఆయిల్‌ (ఇండియన్‌ బాస్కెట్‌) బ్యారల్‌ ధర 100 డాలర్లుగా అంచనా.  
► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయెల్స్‌కు వెసులుబాటు
► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా  ‘ఎస్‌డీఎఫ్‌’ ఇన్‌స్ట్రమెంట్‌.  


వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ
వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్‌ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్‌ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్‌బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్‌లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు.     చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్‌లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్‌ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్‌లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్‌ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement