రాజన్ వారసుడిగా.. పనగరియా?
ఈ వారంలోనే ఆర్‌బీఐ కొత్త గవర్నర్ ప్రకటన!
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వారసుడిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా నియమితులు కానున్నారా? దీనికి సంబంధించిన ప్రకటన ఈ వారంలోనే వెలువడనున్నదా? అవుననే అంటున్నాయి ఆర్థిక వర్గాలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజన్ తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌గా అరవింద్ పనగరియా పేరు దాదాపు ఖరారయింది. ఈయనతోపాటు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు సుబీర్ గోకర్ణ్, రాకేశ్ మోహన్, ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వంటి ప్రముఖులు కూడా పోటీలో ఉన్నా... పనగరియావైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చాక ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4న ముగుస్తుంది.
ఏడీబీ చీఫ్ ఎకనమిస్టుగానూ....
♦ అరవింద్ పనగరియా గతేడాది జనవరి 5న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
♦ అంతకు ముందు ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేశారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల్లో విధులు నిర్వహించారు.
♦ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంశంలో పనగరియాకు అపార అనుభవం ఉంది.
♦ 2012 మార్చిలో పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. స్వస్థలం రాజస్థాన్. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పొందారు.