ఉర్జిత్ ‘రేటు’ షాక్! | RBI keeps repo rate unchanged at 6.25%, reverse repo | Sakshi
Sakshi News home page

ఉర్జిత్ ‘రేటు’ షాక్!

Published Thu, Dec 8 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

ఉర్జిత్ ‘రేటు’ షాక్!

ఉర్జిత్ ‘రేటు’ షాక్!

ఎక్కడి వడ్డీరేట్లు అక్కడే...
రెపో 6.25%, రివర్స్ రెపో 5.75%, సీఆర్‌ఆర్ 4 శాతంగా కొనసాగింపు...
నోట్ల రద్దుతో ఈ ఏడాది వృద్ధి అంచనా 7.1 శాతానికి కోత  మార్చినాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం
  తదుపరి పాలసీ సమీక్ష ఫిబ్రవరి 8న  

 
అంచనాలన్నీ తప్పాయి. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో అష్టకష్టాలు పడుతున్న సామాన్యుడికి వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు కూడా ఆవిరయ్యాయి. కనీసం పావు శాతం వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయమంటూ లెక్కలేసిన విశ్లేషకులు, స్టాక్ మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాక్ ఇచ్చారు. కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలానికి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించింది. మొత్తంమీద రుణాలపై వడ్డీరేట్లు దిగొస్తాయని వేచిచూస్తున్నవారందరినీ ఆర్‌బీఐ తీవ్ర నిరాశకు గురిచేసింది. అరుుతే, తాత్కాలిక 100% సీఆర్‌ఆర్ పరిమితిని తొలగించడంతో రుణ రేట్లు రానున్న కాలంలో తగ్గుముఖం పట్టొచ్చని బ్యాంకర్లు పేర్కొనడం కాస్త ఊరటనిచ్చే అంశం.
 
 ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతున్నదన్న భయాల నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ కారణంగా వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా పోటెత్తడంతో ఆర్‌బీఐ కచ్చితంగా ఈ సమీక్షలో పావు శాతమైనా రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు.
 
‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి, ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఉంటుంది. మరోపక్క, డీమోనిటైజేషన్ కారణంగా ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. ఈ స్వల్పకాలిక ప్రతికూలతల వల్లే ప్రస్తుత సమీక్షలో కాస్త ఆచితూచి రేట్లను యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సరళ పాలసీ విధానం కొనసాగుతుంది. రానున్న కాలంలో వెలువడే ప్రధాన ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తదుపరి పాలసీ చర్యలు ఉంటారుు’ అని ఆర్‌బీఐ పేర్కొంది. కాగా, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలవల్లే పాలసీ రేట్లను తగ్గించలేదా అన్న ప్రశ్నకు దాంతో సంబంధం లేదని ఉర్జిత్ పటేల్ పేర్కొనడం గమనార్హం.
 
 ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కు...
 రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి(మార్చి) 5 శాతంగానే ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. అరుుతే, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే రిస్కు ఉందని అభిప్రాయపడింది.
 
 100 శాతం తాత్కాలిక సీఆర్‌ఆర్ రద్దు...
 తాత్కాలికంగా కొత్త డిపాజిట్లపై 100 శాతం నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం)ను ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి దీన్ని తొలగించనున్నామని పాలసీ సమీక్ష సందర్భంగా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి డిపాజిట్లు వెల్లువెత్తడంతో వాటిపై తాత్కాలికంగా సీఆర్‌ఆర్‌ను 100 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్ స్థిరీకరణ పథకం(ఎంఎస్‌ఎస్) కింద ప్రభుత్వ బాండ్‌ల జారీ పరిమితిని ఇటీవలే రూ.30 వేల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచిన నేపథ్యంలో ఈ 100 శాతం తాత్కాలిక సీఆర్‌ఆర్‌ను తొలగించేందుకు ఆర్‌బీఐకి మార్గం సుగమం అరుుంది. దీంతో ఇకపై డీమోనిటైజేషన్‌లో భాగంగా బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లను(ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది) బ్యాంకులు తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి దోహదం చేస్తుంది.
 
 వృద్ధికి డీమోనిటైజేషన్ దెబ్బ...

 డీమోనిటైజేషన్ కారణంగా డిమాండ్ మందగించడంతో స్వల్పకాలానికి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభవం ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) జీడీపీ వృద్ధి అంచనాలను 7.1 శాతానికి తగ్గించింది. గతంలో ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనా 7.6 శాతంగా ఉంది. ‘ప్రధానంగా నగదు లావాదేవీలపై అధికంగా ఆధారపడి ఉండే రిటైల్ వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణాతో పాటు అసంఘటిత రంగంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం తీవ్రంగా దెబ్బతినొచ్చు. ఈ రంగాల్లో డిమాండ్ దిగజారనుంది. దీంతో మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్దిని దిగజార్చవచ్చు. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వచ్చింది’ అని ఆర్‌బీఐ పేర్కొంది.
 
 పరిశ్రమవర్గాల నిరాశ...
 న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచడంపై పరిశ్రమవర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే.. కుదేలవుతున్న పరిశ్రమకు ఊతమిచ్చేందుకు, పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడి ఉండేదని పేర్కొన్నాయి. ’ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్‌ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఉండి ఉంటే పారిశ్రామిక ఎకానమీకి ఊతమిచ్చినట్లయ్యేది. డీమోనిటైజేషన్ కారణంగా వినియోగ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే ఇటు వినియోగదారులకు, అటు పరిశ్రమకు తోడ్పాటు అందించినట్లయ్యేది’ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ న్యోతియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో దేశీ ఆర్థిక వ్యవస్థ నుంచే వృద్ధికి తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, వృద్ధి, రుణాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పైనా డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉందని అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోరియా చెప్పారు.
 
 కోతతో సెంటిమెంట్ మెరుగుపడేది..
 వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం ఉండేది. తగ్గించకపోవడం వల్ల మార్కె ట్ కాస్త నిరాశపడి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో డిమాండ్ గణనీయంగా పతనమైంది. డిమాండ్ పెరగాలంటే.. ఎకానమీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదనపు సీఆర్‌ఆర్ పెంపు తొలగింపు, మార్కెట్ స్థిరీకరణ పథకం కింద బాండ్ల జారీ పరిమితిని రూ. 6 లక్షల కోట్లకు పెంచడం పరిణామాలతో బ్యాంకులకు ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. వ్యవస్థలో ఆర్థిక స్థిరీకరణకు దోహదం చేస్తుంది.  
 - అరుంధతి భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
 
 ఉదార విధానం..
 అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఉదార విధానం కొనసాగించింది. ఒకవైపు వృద్ధికి తోడ్పాటునిస్తూ.. మరోవైపు మధ్యకాలికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించడంపై దృష్టితో ద్రవ్యపరపతి విధానాన్ని స్థిరంగా ఉంచింది. అదనపు సీఆర్‌ఆర్ నిబంధన ఉపసంహరణ, లిక్విడిటీ నిర్వహణకు ఎంఎస్‌ఎస్ తదితర సాధనాలను ఉపయోగించడం మొదలైనవి స్వాగతించతగ్గ అంశాలు. రాబోయే రోజుల్లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్ల తగ్గుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
 - చందా కొచర్, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్
 
 డీమోనిటైజేషన్ ప్రభావాలపై ధీమా..
 వృద్ధిపై డీమోనిటైజేషన్ ప్రభావాలు తాత్కాలికమైనవేనని, మధ్య-దీర్ఘకాలికంగా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని ఆర్‌బీఐకి ఉన్న ధీమాను పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించడం ప్రతిబింబిస్తోంది.
 - రాణా కపూర్, సీఈవో, యస్ బ్యాంక్
 
 వేచి చూసే ధోరణి..
 ఆర్‌బీఐ పావు శాతం పాలసీ రేట్లు తగ్గించవచ్చని చాలా మంది భావించారు. కానీ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులు ఎలా ఉంటాయో పరిశీలించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ వేచి చూసే ధోరణిని అవలంబించింది.
 - చంద్రశేఖర్ ఘోష్, చైర్మన్, బంధన్ బ్యాంక్
 
 సాహసోపేత నిర్ణయం: ఆర్థిక శాఖ
 పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ స్వాగతించింది. ‘అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం తగ్గుదలకు కొన్ని అటంకాలు నెలకొన్నాయి. ఇవన్నీ పరిశీలించే ఆర్‌బీఐ వేచిచూసే ధోరణితో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణరుుంచింది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ప్రజల అంచనాలకు భిన్నంగా ఉంది కాబట్టి.. ఇది సాహసోపేతమైన చర్యేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రణియన్ వ్యాఖ్యానించారు.
 
 అందుకే తగ్గించకపోరుు ఉండొచ్చు..
 డీమోనిటైజేషన్ ప్రభావంతో వ్యవస్థలోకి గణనీయంగా నగదు వచ్చి చేరింది. ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత స్థారుులోనే తిరుగాడుతోంది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా రేట్లను తగ్గించి ఉంటే బోలెడంత ఊతంగా ఉండేది. అయితే, గత పాలసీ రేట్ల కోతల ప్రయోజనాల పూర్తి బదలారుుంపు కోసం ఆర్‌బీఐ బహుశా ఎదురుచూస్తుండవచ్చు. అందుకే రేట్ల కోత నిర్ణయం వాయిదా వేసి ఉండొచ్చు. ప్రస్తుతం నగదు లభ్యత బాగానే ఉంది.. అలాగే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం కూడా తగ్గనుంది కాబట్టి అవి ఇప్పుడిక వడ్డీ రేట్లు తగ్గించవచ్చు.
 - వీఎస్ పార్థసారథి, గ్రూప్ సీఎఫ్‌వో, ఎంఅండ్‌ఎం గ్రూప్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement