
నల్లధనం ఎంత ఉందో ఎవ్వరికీ తెలియదు:ఆర్బీఐ గవర్నర్
గుజరాత్: విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం ఎంతన్నదీ ఎవరికీ తెలియదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న నల్లధనంపై ఇప్పటికే పలు ఊహాగానాలు సాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదాయం పన్ను రేట్లను మరింత తగ్గించడం ద్వారా అక్రమ నిధుల తరలింపును తగ్గించవచ్చని ఆయన సూచించారు. డాక్టర్ వర్గీస్ కురియన్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన రాజన్ మీడియాతో మాట్లాడారు.
విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకోవడాన్ని అరికట్టే అంశంపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.ఇందుకు ఎగువ తరగతి వారికి పన్ను రేట్లు ప్రోత్సాహకరంగా ఉండేలా చర్యలు చేపడితే నల్లధనం అంశాన్ని అరికట్టే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.