మోదీపై నేను ఏం మాట్లాడినా ప్రాబ్లమే!
న్యూఢిల్లీ: త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మాట్లాడేందుకు నిరాకరించారు. పలు అంశాలపై ప్రభుత్వ తీరును బాహాటంగా విమర్శించేరీతిలో గతంలో వ్యాఖ్యలు చేసిన రాజన్.. ప్రధాని మోదీపై తాను ఏం మాట్లాడినా అది సమస్యాత్మకం (ప్రాబ్లమేటిక్) అవుతుందని పేర్కొన్నారు.
అసహనం మొదలు కేంద్రం ప్రతిష్టాత్మక పథకం 'మేకిన్ ఇండియా' వరకు రాజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బీబీసీతో 'ర్యాపిడ్ ఫైర్' తరహా ఇంటర్వ్యూలో మోదీ గురించి వివరించమని అడుగగా.. 'నేను ఈ ప్రశ్నను దాటవేయాలనుకుంటున్నాను. నేనేమీ చెప్పినా అది సమస్యాత్మకమే అవుతుంది. కనుక ఈ ప్రశ్నను పాస్ చేస్తాను' అని చెప్పారు.
షికాగో యూనివర్సటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన వెంటనే తిరిగి తన పాత అధ్యాపక వృత్తికి తరలిపోతానని తెలిపిన సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై రాజన్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇరకాటంలో పడిన ప్రభుత్వం ఆయనను మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించడానికి వెనుకాముందాడింది. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రెండోసారి ఈ పదవిలో కొనసాగబోనని రాజన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.