మరోసారి షాక్ ఇచ్చిన ఆర్బీఐ
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా వడ్డీరేటు పెంచింది. రెపోరేటును 7.75 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో 7.25 శాతంగా ఉన్న రెపోరేటు 5 నెలల్లో 0.75 శాతం పెరిగి 8 శాతానికి వచ్చింది. అంటే ప్రతి లక్ష రూపాయల రుణానికి అదనంగా ఏడాది 750 రూపాయలు ఇప్పుడు చెల్లించాల్సి వస్తోంది. 10 లక్షల రూపాయల హౌసింగ్ లోను తీసుకున్న వారికి ఏడాది 7500 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి గడిచిన అయిదు నెలల్లో ఏర్పడింది.
అయితే రిజర్వ్ బ్యాంకు వడ్డీరేటు పెంచిన మేరకు అన్ని బ్యాంకులు.. రుణాలపై వడ్డీరేట్లను పెంచలేదు. ఇది కొంత నయం. ధరల పెరుగుదలను అరికట్టేందుకు వడ్డీరేట్లు పెంచకతప్పలేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ చెబుతున్నారు. ఇది చివరి పెంపు కావొచ్చని ఆయన చెప్పారు. ఈ మాటే నిజం కావాలని.. ఇకపైనా వడ్డీరేట్లు పెరగకుండా తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం.