ఆర్‌బీఐ వృద్ధి మంత్రం! | Growth currently not undermined due to rising COVID-19 cases | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ వృద్ధి మంత్రం!

Published Thu, Apr 8 2021 5:09 AM | Last Updated on Thu, Apr 8 2021 5:09 AM

Growth currently not undermined due to rising COVID-19 cases - Sakshi

ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సర్దుబాటు విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతమిచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు గాను గతేడాది 1.15 శాతం మేర ఆర్‌బీఐ రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ బాండ్లను రూ.లక్ష కోట్ల మేర ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) కొనుగోలు చేస్తామని ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రుణ వ్యయాలను తగ్గించడంతోపాటు, బాండ్‌ ఈల్డ్స్‌ను అదుపులో ఉంచేలా వ్యవహరించనుంది.

వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత
వృద్ధికి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. ఎంపీసీ సమావేశం తర్వాత నిర్ణయాలను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని పరుగు అందుకునే వరకు ఆర్‌బీఐ అన్ని విధాలుగా (కనిష్ట వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత చర్యలు) మద్దతుగా నిలుస్తుందన్నారు. కనిష్ట రివర్స్‌ రెపో విధానం నుంచి ఆర్‌బీఐ ఎప్పుడు బయటకు వస్తుందన్న ప్రశ్నకు.. కాలమే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను దృష్టిలో పెట్టుకుని.. తటస్థ చర్యలను తీసుకోవడంపై అవగాహన కలిగి ఉన్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ డీ పాత్ర పేర్కొన్నారు.  

వృద్ధి 10.5 శాతం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘క్యూ1లో (ఏప్రిల్‌–జూన్‌) 26.2 శాతం, క్యూ2లో (జూలై–సెప్టెంబర్‌) 8.3 శాతం, క్యూ3లో (అక్టోబర్‌–డిసెంబర్‌) 5.4 శాతం, క్యూ4లో (2022 జనవరి–మార్చి) 6.2 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చు’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది.

అంతర్జాతీయంగా ఫిబ్రవరి నుంచి కమోడిటీ ధరలు పెరగడం, ఆర్థిక మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వృద్ధి రేటును కిందకు తీసుకెళ్లే రిస్క్‌లుగా దాస్‌ పేర్కొన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, మరిన్ని వర్గాలకు విస్తరించడం, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులను పెంచే చర్యలు వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చెప్పారు.  2021–22 బడ్జెట్‌లో ప్రకటించిన పెట్టుబడి చర్యలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ), సామర్థ్య విస్తరణ అన్నవి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం నియంత్రణలోనే..
రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. అదే సమయంలో నైరుతి రుతుపవనాల పురోగతిపైనా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంది.

అవసరమైనంత కాలం అండగా...
వృద్ధి రేటు నిలకడగా, స్థిరంగా కొనసాగేందుకు అవసరమైనంత కాలం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోయేంత వరకు సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రానున్న రోజుల్లోనూ ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉంటుంది. ఇటీవల కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు భారీగా పెరగడం భవిష్యత్తు వృద్ధి అంచనాలపై అనిశ్చితికి దారితీసింది. ముఖ్యంగా స్థానిక, ప్రాంతీయ లాక్‌డౌన్‌లు ఇటీవలే మెరుగుపడిన డిమాండ్‌ పరిస్థితులను దెబ్బతీస్తాయా? సాధారణ పరిస్థితులు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. అయితే, ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పుడు మరింత మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా పడకుండా చూసేందుకు ద్రవ్య, పరపతి యంత్రాంగాలు సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణికి తగినట్టు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పుష్కలంగా ఉండేలా ఆర్‌బీఐ చూస్తుంది. అంటే ఫైనాన్షియల్‌ మార్కెట్, ఉత్పత్తి రంగాల అవసరాలకు మించి నగదు లభ్యత ఉండేలా చూడడం. ఆర్థిక స్థిరత్వం కోసం చేయాల్సినదంతా ఆర్‌బీఐ చేస్తుంది. అంతర్జాతీయ ప్రభావాలు, అస్థిరతలను దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్లు తట్టుకునేలా తగిన చర్యలతో రక్షణ కల్పిస్తాం. నేటి పరిస్థితుల్లో మారటోరియం (రుణ చెల్లింపులపై కొంత కాలం విరామం) అవసరం లేదు. ప్రైవేటు రంగం తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన సన్నద్ధతతో ఉంది.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు హామీతో కూడిన, నిరంతర ద్రవ్య లభ్యతకు కట్టుబడి ఉన్నట్టు ఆర్‌బీఐ ప్రకటన స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సవాళ్లను అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శనం చూపించింది. వృద్ధిపై స్పష్టమైన ముద్ర వేసింది.

– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌


రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతోపాటు ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించింది. పుష్కలంగా ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటించడం.. ఎన్‌హెచ్‌బీకి అదనంగా రూ.10,000 కోట్లు సమకూర్చడం అన్నది.. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు సాయపడేవి.

– హర్షవర్ధన్‌ పటోడియా, క్రెడాయ్‌ జాతీయ ప్రెసిడెంట్‌

రూ.లక్ష కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలు
సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌లు) కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్‌ఏపీ) ఆర్‌బీఐ ప్రకటించింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. బాండ్‌ఈల్డ్స్‌ గమనా న్ని గాడిలో పెట్టేందుకు (బాండ్‌ ఈల్డ్స్‌లో క్రమబద్ధత) ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మానిటరీ పాలసీకి అనుగుణంగా బ్యాలన్స్‌ షీటును కొసాగించేందుకు ఆర్‌బీఐ మొదటిసారి నిర్ణయించింది. ప్రతీ త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల మేర (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు) మార్కెట్‌కు అందించనున్నాం’ అని మేఖేల్‌ డి పాత్ర తెలిపారు. బాండ్ల కొనుగోలు అన్నది ఇతర ప్రధాన సెంట్రల్‌ బ్యాంకులు అనుసరించిన విధానం మాదిరేనన్నారు. మొదటగా ఏప్రిల్‌ 15న రూ. 25,000 కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐ కొనుగోలు చేయనుంది.

రాష్ట్రాలకు నిధుల సాయం కొనసాగింపు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యంతర వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏఎస్‌) కింద రూ.51,560 కోట్ల సాయాన్ని పొందే గడువును వచ్చే సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో విడత ప్రభావాలను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్రాలకు ఈ మేరకు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఆదాయాలు, వ్యయాల మధ్య అంతరాలను గట్టేందుకు గాను రాష్ట్రాలకు అందించే తాత్కాలిక రుణ సదుపాయమే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెన్స్‌. అలాగే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే అగ్రిగేట్‌ డబ్ల్యూఎంఏ సాయం రూ.32,225 కోట్లుగా ఉండగా.. దీన్ని 46% పెంపుతో రూ.47,010 కోట్లు చేస్తూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది.

నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు రూ.50వేల కోట్లు
ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలకు రుణ వితరణ సక్రమంగా అందేలా చూసేందుకు జాతీయ ఆర్థిక సంస్థలకు అదనంగా రూ.50వేల కోట్లను ఆర్‌బీఐ అందించనుంది. నేషనల్‌ బ్యాంకు ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)కు రూ.25,000 కోట్లు, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు రూ.10,000 కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కు రూ.15,000 కోట్లు లభిస్తాయి.

వ్యాలెట్ల మధ్య నగదు బదిలీలు
చెల్లింపుల సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్‌బీఐ పలు చర్యలను తాజా సమీక్షలో ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర చెల్లింపుల సేవల సంస్థలు, పేమెంట్‌ బ్యాంకులు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ లావాదేవీలను ప్రాసెస్‌ చేసేందుకు వీలు కల్పించింది. ఆర్‌బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల సేవలైన (సీపీఎస్‌) ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌లను ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దాస్‌ ప్రకటించారు. ఆపరేటర్లు ఇందుకు గాను సీపీఎస్‌ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. డిజిటల్‌ ఆర్థిక సేవలు మరింత మందికి చేరుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు.

ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రీపెయిడ్‌ చెల్లింపుల సేవలను అందించే సంస్థలు (ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌/పీపీఐ).. తమ కస్టమర్లు ఇతర సంస్థల పరిధిలోని కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించుకునేలా ఇంటర్‌ ఆపరేబులిటీని అమలు చేసే చర్యలను చేపట్టనున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ సేవలను అందించే ఎంపికను పీపీఐలకు ఇచ్చామని.. ఒక పీపీఐ పరిధిలోని కస్టమర్‌ మరో పీపీఐ/బ్యాంకు పరిధిలోని కస్టమర్‌కు నగదు బదిలీలు చేసుకోవచ్చని దాస్‌ చెప్పారు. పీపీఐ పరిధిలో ఒక కస్టమర్‌కు సంబంధించి బ్యాలన్స్‌ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచింది. పూర్తి స్థాయి కేవైసీ కస్టమర్లకే ఇది వర్తిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement