రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు, కేంద్రానికి మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఘర్షణ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈ పరిణామానికి సహజంగానే మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు వారాల గరిష్ట పాయింట్లు నమోదుచేశాయి. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సోమ వారం తొమ్మిది గంటలపాటు సాగించిన సుదీర్ఘ సమావేశం అనంతరం ప్రధానమైన నగదు నిల్వల అంశంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అలాగే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణ, ఆ పరిశ్రమలకు కల్పించాల్సిన రుణలభ్యత అంశాలను పరిశీలించేందుకు ఆర్‌బీఐ అంగీకరించింది. సమావేశం సాఫీగా సాగిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పవలసి వచ్చిందంటేనే కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య గత కొన్నాళ్లుగా ఏ స్థాయిలో విభేదాలొచ్చాయో అర్ధమవుతుంది. ఆర్‌బీఐ గవర్నర్ పదవి సంక్లిష్టమైనది. ఆ బ్యాంకు ప్రభుత్వానికి చెందిన కీలకమైన అంగం. కనుక గవర్నర్లుగా ఉండేవారు సర్వ స్వతంత్రంగా పనిచేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఎప్పుడూ ప్రభుత్వానిదే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందల్లా చేసుకుంటూ పోతే కొంప మునిగే ప్రమాదం ఏర్పడవచ్చు. కనుకనే పాలకులు ఏరి కోరి తెచ్చుకున్నవారు సైతం కీలక సందర్భాల్లో సమస్యగా మారతారు.
వేణుగోపాలరెడ్డి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నకాలంలో ప్రధానిగా మన్మోహన్‌సింగ్, ఆర్థిక మంత్రిగా చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా సి. రంగరాజన్ ఉండేవారు. అందరూ ఆర్థికరంగ హేమాహేమీలే. అయినా భిన్న సందర్భాల్లో ఆయన వారితో విభేదించాల్సి వచ్చింది. ఆయన అనంతరం వచ్చిన దువ్వూరి సుబ్బారావు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయనతో కూడా అప్పటి ఆర్థిక మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరంలకు సమస్యలెదురయ్యాయి.
ఇక రఘురాం రాజన్ సంగతి చెప్పనవసరం లేదు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సంస్థల్లో పనిచేసి వచ్చిన రాజన్ వెనకా ముందూ చూడకుండా వడ్డీ రేట్లు తగ్గిస్తారని అరుణ్‌జైట్లీ, అరవింద్ సుబ్రమణియన్‌లు ఆశపడ్డారు. కానీ ఆయన అందుకు సిద్ధపడలేదు. ఆర్థిక వృద్ధి సరే... ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ఎలాగని ఆయన ఎదురు ప్రశ్నించేసరికి వారికి నోట మాట రాలేదు. వడ్డీరేట్లు తగ్గిస్తే చాలు...ఆర్థిక వ్యవస్థ క్షణాల్లో పరుగులు పెట్టడం ఖాయమని జైట్లీ, సుబ్రహ్మణ్యస్వామి వంటివారు ఎంత చెప్పినా ఆయన నిగ్రహం చెక్కు చెదరలేదు. ఇది వారికి ఆగ్రహం కలిగించింది. రాజన్ అనంతరం వచ్చిన ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేక పోయారన్న విమర్శ ఉంది. కానీ అటువంటి ఉర్జిత్‌కు కూడా ఇప్పుడు లడాయి తప్పలేదు.
అయితే ఇప్పుడొచ్చిన వివాదానికి, పాత వివాదాలకూ పోలిక లేదు. గతంలో ఆర్థికమంత్రులు ఆర్‌బీఐపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మినహా మరేం మాట్లాడేవారు కాదు. మీడియాలో విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు రావడం తప్ప ఇప్పటిలా బహిరంగంగా వివాదాల్లోకి దిగలేదు. ఆర్‌బీఐ డైరెక్టర్ల బోర్డు సభ్యుల్లో ఒకరైన ఎస్. గురుమూర్తి బ్యాంకు దగ్గరున్న 9.69 లక్షల కోట్ల నగదు నిల్వలనుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొంత బదిలీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్రవ్య వినిమయంపై ఆంక్షలు విధిస్తే వృద్ధిపై దాని ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అయితే కేంద్రం అధికారికంగా నగదు బదిలీ చేయాలని నేరుగా కోరలేదు.
కానీ ఎన్నడూ లేని విధంగా ఆర్‌బీఐ వ్యవహారాలను డైరెక్టర్ల బోర్డే నిర్వహిం చేవిధంగా ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించడానికి కేంద్రం వెనకాడదన్న కథనాలు వెలువడ్డాయి. దానికి జవాబుగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య ఒక సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకు స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగిస్తే ఆర్థిక రంగంలో పెను సంక్షోభం ఖాయమని హెచ్చరించారు. అందుకాయన 2010నాటి అర్జెంటీనా ఉదంతాన్ని కూడా ఉటంకిం చారు. ఆర్‌బీఐ నగదు నిల్వల్లో 3.60 లక్షల కోట్లు బదలాయించాలని కేంద్రం చేస్తున్న డిమాండు సరికాదని ఆయన ఆ రకంగా తేల్చిచెప్పారు. అయితే సోమవారంనాటి డైరెక్టర్ల బోర్డు సమావేశం నేరుగా దీనిపై నిర్ణయం తీసుకోకుండా నిల్వలను బదిలీ చేయడానికి అనుసరించాల్సిన ఆర్థిక చట్రం(ఈసీఎఫ్) ఎలా ఉండాలన్న సిద్ధాంత చర్చలోకి పోయింది. చివరకు దానిపై ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. చర్చ సందర్భంగా ఆర్‌బీఐ కీలకమైన డేటా ఆధారంగా తన వాదనను సమర్థించుకుంది.
ఇక ఆర్‌బీఐ తక్షణ దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని తీసుకురావడంపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. తమ రాబడిలో 10శాతానికి మించి నిరర్థక రుణాలున్న బ్యాంకులు కొత్త రుణాలివ్వడానికి వీల్లేదని ఈ పీసీఏ నిర్దేశిస్తోంది. ఫలితంగా ఎంఎస్‌ఎంఈలకు రుణలభ్యత ఉండటం లేదు. దీనిపైనా నిపుణుల కమిటీ ఏర్పాటైంది. పీసీఏను సరళీకరిస్తే తప్ప ఎంఎస్‌ఎంఈలకు రుణలభ్యత అంతం తమాత్రంగానే ఉంటుంది. ఇవన్నీ పెద్దనోట్ల రద్దుతో కుదేలైనవి గనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీటికి అప్పుదొరికేలా చూడాలని కేంద్రం ఆత్రంగా ఉంది. కానీ పది భారీ పరిశ్రమలనుంచి రావా ల్సిన మొండి బకాయిల సంగతిని బోర్డు పరిశీలించలేదు. ఆ బకాయిల మొత్తం దాదాపు 4 లక్షల కోట్లు! ఈ బకాయిలు వసూలైతే బ్యాంకులు కళకళలాడతాయి. ఇలాంటి సమస్యల జోలికి పోకుండా తాను అనుకున్నట్టే అంతా పరిష్కారం కావాలని కేంద్రం కోరుకోవచ్చు. కానీ బాధ్యత గల సెంట్రల్ బ్యాంకుగా ఆర్‌బీఐ అంత ఉదారంగా వ్యవహరించలేదు. ఇప్పుడు చేసిన నిర్ణయాలు, వాయిదా పడిన మరికొన్ని సమస్యలపై వచ్చే నెల 14న మరోసారి జరిగే డైరెక్టర్ల బోర్డు సమావేశం ఏం చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment