ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అదృశ్యం!
-
కనిపించడం లేదంటూ ట్విట్టర్‌లో పోస్టు.. వైరల్
దేశంలో రూ. 500, వెయ్యినోట్లు రద్దుచేసి దాదాపు 15 రోజులవుతోంది. అయినా ఇప్పటికీ ప్రజలు నగదు కష్టాలు తొలిగిపోలేదు. దేశంలో ఎక్కడ కూడా తగినంత నగదు అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితులతో తీవ్రంగా చిరాకు పడుతున్న నెటిజన్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు ఆర్బీఐ గవర్నర్ ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉర్జిత్ కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారి.. తీవ్రంగా హల్‌చల్ చేస్తోంది.
పెద్దనోట్ల రద్దుపై అనంతరం ఉర్జిత్ మీడియాలో కనిపించకపోవడాన్ని తప్పుబడుతూ.. ‘మిస్సింగ్.. మీరు ఉర్జిత్‌ను చూశారా’ అంటూ ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. ఉర్జిత్ ఫొటో పెట్టి.. ‘ఉర్జిత్ పటేల్, వయస్సు 53 ఏళ్లు. చివరిసారిగా ఆర్బీఐ భవనం వద్ద కనిపించాడు. అన్నింటినీ క్షమించేశాం. దయచేసి ఇంటికి రా. ఎవరైనా ఆచూకీ చెబితే రివార్డు ఇస్తాం. దయచేసి 01123710538 నంబర్‌కు కాల్ చేయండి’ అంటూ మధు మీనన్ చేసిన ట్వీట్ ఆనతికాలంలో వైరల్ అయింది. బహుశా తాను చేసిన పెద్ద పొరపాటుకు చింతిస్తూ ఉర్జిత్ ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటాడని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ బాధ్యత వహించాలన్న డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలిండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ ఉర్జిత్‌ను పదవి నుంచి పీకేయాలని డిమాండ్ చేసింది.