
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు.
ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు.