
బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్
‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌కు ఫిర్యాదు చేశారు.
* ‘మాఫీ’ రైతులకు కొత్త రుణాలపై ఆర్‌బీఐ గవర్నర్‌తో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్... రైతులకు రుణాలివ్వని అంశంపై తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని, అన్ని సమస్యలూ సర్దుకునేలా చూస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.
బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆయన ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగావ్యవసాయ రంగంతో పాటు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరముందని కేసీఆర్ వారితో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రఘురాం రాజన్... ఆర్‌బీఐ పరిధిని మరింత విస్తృతపరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణ వితరణతో పాటు మరింత సహకారం అందించడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఆర్‌బీఐ త్వరలో చిన్న బ్యాంకులకు అనుమతులు ఇవ్వనుందని..ఆ బ్యాంకులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలిచ్చేలా చూస్తామని వివరించారు.
కొత్త రాష్ట్రం.. సహకరించండి..
కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టిందని.. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులివ్వడానికి సీఎం కార్యాలయంలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటికే మూడు లక్షల ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల క ల్పనకు చ ర్యలు తీసుకుంటున్నామని... పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు.
దీనికి రఘురాం రాజన్ బదులిస్తూ... ఎలాంటి సంకోచం లేకుండా తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులను రుణాలు కోరవచ్చని, అవసరమైన మేర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని, అవసరమైన నిధులను నాబార్డు నుంచి ఇప్పించేలా చూడాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరారు. హైదరాబాద్ పరిశ్రమల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిందని, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని అన్నారు.
కేసీఆర్ పనితీరు భేష్..
కొద్ది నెలల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు బాగుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభినందించారు. ముఖ్యమంత్రి చేసిన పలు ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.