
రూ. 1000 నోటుపై ఆర్బీఐ క్లారిటీ
పాత పెద్ద నోట్ల రద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు.
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ నగదు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త నోట్లు సరఫరా చేశామన్నారు. తగినన్ని కొత్త నోట్లు సరఫరా చేస్తామని, ప్రజలు వీటిని దాచుకోవద్దని సూచించారు. నోట్ల రద్దు తర్వాత అధికారికంగా కొత్త నోట్ల సరఫరాపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు 11.55 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు డిపాజిటయ్యాయని వెల్లడించారు. గత రెండు వారాలు 500, 100 రూపాయల నోట్ల ముద్రణ వేగవంతం చేసినట్టు చెప్పారు. వెయ్యి రూపాయిల నోటును తిరిగి ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నోట్ల కష్టాలు తీరిన తర్వాత నగదు ఉపసంహరణపై పరిమితులు తొలగిస్తామన్నారు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీటుపై నోట్ల రద్దు ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఆర్బీఐ తర్వాతి సమావేశం ఫిబ్రవరి 7-8 మధ్య ఉంటుందని తెలిపారు.