
రుణమాఫీకి సహకరించండి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణ మాఫీ అమలు చేయడానికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ రాజన్‌ను కోరారు.
ఆర్‌బీఐ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
ఫోన్‌లోనూ ఈ అంశంపై చర్చ
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణ మాఫీ అమలు చేయడానికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ రాజన్‌ను కోరారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కలిగించడానికి తగిన సలహాలు ఇవ్వాలని, ఈ విషయమై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబు ఒక లేఖ రాశారు. ఫోన్లో కూడా ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించారు. రుణ మాఫీపై ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో తాను లేఖ రాస్తున్నట్లు బాబు పేర్కొన్నారు. ‘రాష్ట్ర రైతాంగం గత ఐదేళ్ల కాలంలో కరువు, తుపానులతో తీవ్రంగా పంటలను నష్టపోయారు. ఎరువులు, విత్తనాల ధరలు బాగా పెరిగిపోయారుు. పెట్టుబడి వ్యయం పెరిగినా దానికి తగినట్టుగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించలేదు. ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధరకు చర్యలు తీసుకోలేదు.
దీంతో పంటలను తక్కువ ధరకు విక్రయించిన రైతులు నష్టపోయారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించాం..’ అని వివరించారు. హామీ మేరకు రుణాల మాఫీ అమలు చేసేందుకు సహకరించడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖలో కోరారు. ‘ఈ విషయమై త్వరలో మిమ్మల్ని కలిసి చర్చిస్తా..’ అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోతే ఎదురయ్యే ఇబ్బందులను చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది.