బాబు, కేసీఆర్ ఇద్దరూ మాయలపకీర్లే: నారాయణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరిపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఆయనో మాయల పకీరు, ఈయనో మాయల పకీరని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినా ప్రజల తలరాత మారలేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామంటున్నారని మండిపడ్డారు. కానీ అసలు బాబు సీఎం అయ్యాక ఇప్పటివరకు ఒక్కపైసా కూడా రుణమాఫీ జరగలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క అనంతపురం జిల్లాలోనే 72 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, హామీలు నెరవేర్చనందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ పర్యటనకు అయిన ఖర్చుతో కరువు రైతులకు సాయం అందించి ఉంటే బాగుండేదని నారాయణ అభిప్రాయపడ్డారు. రాజధాని పేరుతో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, రైతు ఆత్మహత్యలన్నీ చంద్రబాబు చేయించిన హత్యలేనని ఆయన విమర్శించారు.