YSR Navodayam Scheme
-
వైఎస్సార్ నవోదయం: చిన్నపరిశ్రమలకు సర్కారు దన్ను
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇతడి పేరు పి.సుధాకర్. సొంత ఊళ్లోనే ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సుధాకర్ హైదరాబాద్‌లో తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి వచ్చేశారు. తనకున్న అనుభవంతో ఫ్యాన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. ఏపీఐఐసీ, బ్యాంకు అందించిన రుణసాయంతో ఎంఎస్ఎంసీ యూనిట్ నెలకొల్పారు. దానిని ప్రారంభించిన రెండేళ్లకే కరోనా ముంచుకొచ్చింది. యూనిట్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆదాయం లేకపోయినా బ్యాంకు వాయిదాలతోపాటు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతినెలా చెల్లించాల్సి వచ్చింది. అప్పటికే అప్పులు రూ.80 లక్షలు దాటేశాయి. ఇక తన పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘రీ స్టార్ట్’ పేరుతో ఎంఎస్ఎంఈలకు ఆపన్నహస్తం అందించారు. సుధాకర్ నెలకొల్పిన యూనిట్‌కు పాత బకాయిల రూపంలో ఒకేసారి రూ.51.50 లక్షలు చెల్లించారు. అలాగే లాక్డౌన్ కాలానికి మూడు నెలల విద్యుత్ చార్జీలను మాఫీ చేశారు. దీంతో అతడు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా నిలదొక్కుకోగలిగాడు. సుధాకర్ మాట్లాడుతూ.. ‘రీ స్టార్ట్ ప్యాకేజీ రూపంలో వచ్చిన మొత్తంతో బ్యాంకు రుణం తీర్చేశాను. ఖర్చులను తగ్గించుకున్నాను. వెంటిలేటర్‌పై ఉన్న నా పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రీ స్టార్ట్ పేరుతో ఊపిరిలూదటంతో కోవిడ్ కష్టాలు ఇంకా ఉన్నప్పటికీ అతిపెద్ద సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్క సుధాకరే కాదు.. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వైఎస్సార్ నవోదయం, రీ స్టార్ట్ ప్యాకేజీలు ఆపన్న హస్తం అందించాయి. సాక్షి, అమరావతి : కోవిడ్ రూపంలో ముంచుకొచ్చిన సంక్షోభం కారణంగా రాష్ట్రంలో ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం పుణ్యమా అని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవనోపాధి నిలబడింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గత ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిల కింద రూ.904.83 కోట్లను విడుదల చేయడంతోపాటు ఆయా యూనిట్ల రుణాల కోసం గ్యారంటీగా రూ.250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎస్సీ వర్గాలకు చెందిన 4,093, ఎస్టీ వర్గాలకు చెందిన 810 యూనిట్లు ప్రయోజనం పొందాయి. ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నమ్మకం పెరగడంతో బ్యాంకులు కూడా వాటిని రుణాలిచ్చి తమ వంతుగా ఆదుకున్నాయి. ఇదిలావుంటే.. ఎంఎస్ఎంఈలకు రెండో ఏడాది పారిశ్రామిక రాయితీలను సైతం ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష్యాలను మించి రుణాలు ఎంఎస్ఎంఈ రంగానికి 2020–21 సంవత్సరంలో రూ.39,600 కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. లక్ష్యాన్ని మించి రూ.40,311.76 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులోను అత్యధికంగా సూక్ష్మ సంస్థలను ఆదుకున్నాయి. గతేడాది సూక్ష్మ సంస్థలకు రూ.18,674 కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం కాగా.. రూ.20,598.53 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. అలాగే వ్యాపారాలు లేక తీసుకున్న రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మారిపోయిన ఖాతాలను ‘వైఎస్సార్ నవోదయం’ పథకం కింద పునర్ వ్యవస్థీకరించారు. ఈ విధంగా 2020–21 సంవత్సరంలో రూ.3,236.52 కోట్ల రుణ ఖాతాలను పునర్ వ్యవస్థీకరించాయి. దీనివల్ల 1,08,292 ఖాతాలకు లబ్ధి చేకూరింది. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రుణాల లక్ష్యాన్ని రూ.44,500 కోట్లకు పెంచాయి. పనితీరు బాగుంది రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం పనితీరు బాగుంది. వీటికి గత ఏడాది లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్ష్యాలను అధిగమించాం. అదే విధంగా ఒత్తిడిలో ఉన్న యూనిట్లను ఆదుకునే విధంగా నిరర్థక ఆస్తులను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. ఈ ఏడాది కూడా భారీగా నిర్దేశించుకున్న రూ.44,500 కోట్ల రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం. –వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వ అండతో నిలబడ్డాం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా ఎంఎస్ఎంఈలకు రీ స్టార్ట్ ప్యాకేజీ ప్రకటించారు. కష్టకాలంలో పాత బకాయిలను చెల్లించడంతోపాటు రుణాల గ్యారంటీ కోసం రూ.250 కోట్లు కేటాయించారు. ఈ చర్యల వల్ల కోలుకుని 70 శాతం నిర్వహణ సామర్థ్యంతో సంస్థలు నిలదొక్కుకుని వ్యాపారం చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడ్డాం. – ఏపీకే రెడ్డి, అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా -
ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పది లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో బ్యాంకులు కూడా అంతే పాత్ర పోషిస్తున్నాయి. అత్యధిక ప్రాధాన్యత ► ఎంఎస్ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ► ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈల రుణాలను వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కల్పించారు. ► ఇందులో భాగంగా ఇప్పటి వరకు లక్షకు పైగా యూనిట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి. మొత్తం 1,00,738 యూనిట్లకు చెందిన రూ.2769.82 కోట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి. ► రుణాల పునర్వ్యవస్థీకరణకు ఇంకా 63,515 ఎంఎస్ఎంఈలకు అర్హత ఉందని, వాటి రుణాలనూ త్వరగా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. ► సీఎం వైఎస్ జగన్ ఎంఎస్ఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీ సొమ్ము రూ.905 కోట్లనూ విడుదల చేసిన విషయం తెలిసిందే. ► బ్యాంకులు కూడా గత ఆర్థిక ఏడాది లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేశాయి. -
చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం
సాక్షి, అమరావతి: లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంస్థల (ఎంఎస్ఎంఈ)ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో రుణాలు చెల్లించలేని ఎంఎస్ఎంఈలకు ‘రుణాల ఏక కాల పునర్వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) చేయడంలో ఆర్థికసాయం అందించే విధంగా రూపొందించిన ‘డాక్టర్ వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 వేల యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకుంటామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం కోసం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ సర్టిఫికెట్లను అందజేశారు. పథకం ప్రారంభోత్సవంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర: ఆర్థికమంత్రి రాష్ట్రంలో రూ.30,528 కోట్ల పెట్టుబడితో 1,00,629 ఎంఎస్ఎంఈలు పని చేస్తున్నాయని ఆర్థికమంత్రి బుగ్గన వివరించారు. వీటి ద్వారా 10,84,810 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. డాక్టర్ వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యవసాయం తర్వాత అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం గత కొంత కాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘రుణాల ఏకకాల పునర్వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) ద్వారా వీటిని ఆదుకోవడానికి డాక్టర్ వైఎస్సార్ నవోదయం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.రుణాల బకాయలు చెలించలేని ఎంఎస్ఎఈలకు ఓటీఆర్ కల్పించడంతో పాటు, అవసరమయ్యే ఆడిటర్ నివేదిక వయ్యంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.2,00,000 వరకు ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీనివల్ల రుణాల చెల్లింపునకు వారికి గరిష్టంగా ఆరేళ్ల సమయం లభించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందన్నారు. బ్యాంకర్లతో కలిసి ఓటీఆర్‌లో రూ.3,493 కోట్ల మేర లబ్ధి చేకూర్చనున్నట్లు ఆయన వివరించారు. -
‘వైఎస్సార్ నవోదయం’ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు ముఖ్య సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: నేడే ‘నవోదయం’