
బాధ్యతలు స్వీకరిస్తున్న ముకేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎలాంటిæ పరిశ్రమ రావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ఆహారశుద్ధి సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.