ఉపాధి కల్పనకు పెద్దపీట | Five districts are mainly competing in attracting investments | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనకు పెద్దపీట

Published Thu, Jun 3 2021 4:16 AM | Last Updated on Thu, Jun 3 2021 4:16 AM

Five districts are mainly competing in attracting investments - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో భాగంగా భూకేటాయింపులను త్వరితగతిన చేస్తోంది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా వడివడి అడుగులు వేస్తోంది. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేవలం రెండేళ్ల కాలంలోనే 2,068 కంపెనీలకు 2,526.52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 2,050 కంపెనీలు సూక్ష్మ, మధ్యతరగతికి చెందినవే కావటం విశేషం. డీఆర్‌డీవో, పార్లే ఆగ్రో, ఏటీజీ టైర్స్, ఇంటెలిజెంట్‌ సెజ్, ఓఎన్‌జీసీ, ఏఆర్‌ లైఫ్‌ సైన్స్, జీఎం మాడ్యులర్, ఆస్ట్రమ్‌ ఇండస్ట్రీస్, లైఫ్‌ టైమ్‌ ఫార్మా వంటి సంస్థలతో పాటు అనేక సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు భూములు కేటాయింపు చేశారు. ఈ యూనిట్ల ద్వారా 1,54,757 మందికి ఉపాధి లభించనుంది. పూర్తి పారదర్శకంగా ఉండేవిధంగా ఆన్‌లైన్‌లోనే భూ కేటాయింపులు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (ఏపీఐసీసీ) అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం హయాంలో.. ఐదేళ్ల కాలంలో 2,980 యూనిట్లకు భూ కేటాయింపులు చేయగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 2,068 కంపెనీలకు భూములు కేటాయించడం విశేషం. ఇంకా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నాయని, త్వరలోనే మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి జరుగుతోందని ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. 

పెట్టుబడుల ఆకర్షణలో ఐదు జిల్లాల మధ్య పోటీ
పెట్టుబడుల ఆకర్షణలో ప్రధానంగా ఐదు జిల్లాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అత్యధికంగా 408 యూనిట్ల ఏర్పాటుతో 35,501 మందికి ఉపాధి కల్పించడం ద్వారా చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. వీటిద్వారా చిత్తూరు జిల్లాలో రూ.3,791.76 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 232 యూనిట్ల ఏర్పాటుతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉండగా.. ఇక్కడ రూ.9,321.37 కోట్ల పెట్టుబడి రానుంది. తద్వారా 33,154 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కృష్ణా జిల్లాలో 267, ప్రకాశం జిల్లాలో 254, తూర్పు గోదావరి జిల్లాలో 223 యూనిట్లకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement