
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ–2021 తీసుకురానున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ తీసుకురాబోతున్నామని వివరించారు. కేంద్ర స్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించి సీఎస్ చైర్మన్‌గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నాన్ మేజర్ పోర్టుల్లో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని.. ఏపీఐఐసీ భూముల్లో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ట్రక్ పార్కింగ్ ప్రాంతాలు నిర్మించాలని.. అక్కడ ఇంధన స్టేషన్లు, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
ఐటీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనలపైన అధికారులతో మంత్రి చర్చించారు. రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ వి గిరి, లంకా శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment