ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి? | Making Tangelamudi carpets with natural colors on looms | Sakshi
Sakshi News home page

ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి?

Published Mon, Oct 25 2021 3:19 AM | Last Updated on Mon, Oct 25 2021 5:14 AM

Making Tangelamudi carpets with natural colors on looms - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సహజసిద్ధ రంగులతో.. అబ్బురపరిచే చిత్రాలతో రాజుల కాలం నుంచి ఆకట్టుకుంటూ వస్తున్న ‘తంగెళ్లమూడి తివాచీ’ రంగు క్రమంగా వెలిసిపోతోంది. కోటకు కొత్త అందం తేవాలన్నా.. ఇంటికి కళ రావాలన్నా ఏలూరు తివాచీ పరచాల్సిందే అనే స్థాయిలో వెలుగొందిన పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. దేశవిదేశీయుల మనసు చూరగొన్న  పరిశ్రమ.. ఇప్పుడు తనకు ‘ఎర్ర తివాచీ’ పరిచేవారి కోసం ఎదురుచూస్తోంది.  

పర్షియా నుంచి వలస.. 
సహజసిద్ధ రంగులతో తయారయ్యే సంప్రదాయ తివాచీలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి ప్రసిద్ధి. గొర్రెల నుంచి సేకరించిన ఊలు, సహజసిద్ధ రంగులు, జూట్, పత్తితో 300 ఏళ్లకు పై నుంచి ఇక్కడ తివాచీలు తయారు చేస్తున్నారు. 18వ శతాబ్ధంలో పర్షియా నుంచి మచిలీపట్నం ఓడరేవుకు తివాచీలు తయారు చేసే ముస్లింలు కొందరు వలస వచ్చారు. వారు కాలక్రమేణ తంగెళ్లమూడిలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తంగేడు వనంలా ఉండేది. తంగేడు పూల నుంచి తీసిన రంగులను తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పత్తి, జూట్‌ కూడా అందుబాటులో ఉండటంతో వారు ఇక్కడే స్థిరపడిపోయారు.

 
50 ఏళ్లకు పైగా మన్నిక.. 
ఎన్ని అడుగుల తివాచీకి ఆర్డర్‌ ఇచ్చినా.. ఇక్కడ అద్భుతంగా తయారు చేసి ఇస్తారు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏలూరులో మాత్రమే చేనేత మగ్గాలపై తివాచీలు తయారు చేస్తారు. ఇవి 50 ఏళ్లకుపైగా మన్నిక ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్‌ ఉండేది. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసేవారు. యంత్రాలు రావడంతో 2002 నుంచి ఇక్కడి పరిశ్రమకు గడ్డుకాలం మొదలైంది. తక్కువ ధరకు ప్లాస్టిక్‌ కార్పెట్లు వస్తుండటంతో అందరూ వాటివైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఏలూరు తివాచీల గురించి తెలుసుకున్నవారు ఆర్డర్లు ఇస్తుండటంతో కొంతకాలం కిందట మంచి డిమాండ్‌ వచ్చిందని తయారీదారులు చెప్పారు. అంతలోనే కరోనా విజృంభించడంతో పరిశ్రమ కుదేలైందని వాపోయారు.  
తివాచీ నేత పనిలో నిమగ్నమైన కార్మికులు 

కరోనాతో దెబ్బ
గతంలో 100 మందికి పైగా చేనేత కార్మికులు, 50 మంది ఎక్స్‌పోర్టర్లు, 20 మంది మాస్టర్‌ వీవర్లతో ఈ పరిశ్రమ కళకళలాడేది. ప్రభుత్వ సహాయ సహకారాలు అందడానికి వీలుగా ఏలూరు కార్పెట్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ నేతృత్వంలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించడంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కొని వెళ్లిపోయారు. నైపుణ్యమున్న చేనేత కార్మికులు తగ్గిపోయారు. 10 మంది కార్మికులతోనే తక్కువ ఆర్డర్లతో నెట్టుకువస్తున్నారు. 6 గంటల పనికి రూ.300 ఇస్తున్నా కార్మికులు దొరకట్లేదని తయారీదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

పర్యావరణ హితం.. 
ఈ తివాచీలు పర్యావరణ హితమైనవని తయారీదారులు చెబుతున్నారు. ఊలు, కాటన్, జూట్‌తో పాటు సహజసిద్ధ రంగులు ఉపయోగిస్తామని తెలిపారు. 50 ఏళ్లకు పైగా మన్నిక ఉండే వీటిని మూడు నెలలకొకసారి శుభ్రం చేస్తే కొత్తగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. సాధారణ కార్పెట్‌ కంటే వీటి ధర కాస్త అధికం. ఇందులోనే 50 శాతం కూలి ఖర్చులు, 30 నుంచి 40 శాతం మెటీరియల్‌ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్‌ తివాచీల్లో హానికర రసాయనాలు వినియోగిస్తారని.. ఇవి భూమిలో, సముద్రంలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మన్నిక రెండేళ్లే ఉంటుంది. కానీ ధర తక్కువ కావడంతో అందరూ ప్లాస్టిక్‌ వైపు వెళుతున్నారని చెబుతున్నారు. 

40 ఏళ్ల నుంచి ఇదే పని 
సిద్ధమైన తివాచీని ఫినిషింగ్‌ చేస్తుంటాను. ఫినిషింగ్‌ ఎంత బాగా చేస్తే అంత మన్నిక ఉంటుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. గతంలో చాలా సందడిగా ఉన్న మా పరిశ్రమ నేడు వెలవెలబోతుంటే చూడటం కష్టంగా ఉంది.  
– సత్యనారాయణ, ఫినిషింగ్‌ కార్మికుడు 

మాది ఐదోతరం 
కార్పెట్‌ తయారీ పరిశ్రమలో నేను ఐదో తరానికి చెందినవాడిని. పనినైపుణ్యంతో అనేక అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు ఆ వెలుగులు పోయాయి. ప్లాస్టిక్‌ కార్పెట్‌ వచ్చాక మా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మార్కెట్‌ కొంత మేర బాగానే ఉన్నప్పటికీ.. కార్మికులు దొరకట్లేదు. నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విక్రయాలకు అవకాశం కల్పిస్తే ఈ రంగం కోలుకుంటుంది. 
– అబ్దుల్‌ నయీం, తయారీదారు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement