carpets
-
ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సహజసిద్ధ రంగులతో.. అబ్బురపరిచే చిత్రాలతో రాజుల కాలం నుంచి ఆకట్టుకుంటూ వస్తున్న ‘తంగెళ్లమూడి తివాచీ’ రంగు క్రమంగా వెలిసిపోతోంది. కోటకు కొత్త అందం తేవాలన్నా.. ఇంటికి కళ రావాలన్నా ఏలూరు తివాచీ పరచాల్సిందే అనే స్థాయిలో వెలుగొందిన పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. దేశవిదేశీయుల మనసు చూరగొన్న పరిశ్రమ.. ఇప్పుడు తనకు ‘ఎర్ర తివాచీ’ పరిచేవారి కోసం ఎదురుచూస్తోంది. పర్షియా నుంచి వలస.. సహజసిద్ధ రంగులతో తయారయ్యే సంప్రదాయ తివాచీలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి ప్రసిద్ధి. గొర్రెల నుంచి సేకరించిన ఊలు, సహజసిద్ధ రంగులు, జూట్, పత్తితో 300 ఏళ్లకు పై నుంచి ఇక్కడ తివాచీలు తయారు చేస్తున్నారు. 18వ శతాబ్ధంలో పర్షియా నుంచి మచిలీపట్నం ఓడరేవుకు తివాచీలు తయారు చేసే ముస్లింలు కొందరు వలస వచ్చారు. వారు కాలక్రమేణ తంగెళ్లమూడిలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తంగేడు వనంలా ఉండేది. తంగేడు పూల నుంచి తీసిన రంగులను తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పత్తి, జూట్ కూడా అందుబాటులో ఉండటంతో వారు ఇక్కడే స్థిరపడిపోయారు. 50 ఏళ్లకు పైగా మన్నిక.. ఎన్ని అడుగుల తివాచీకి ఆర్డర్ ఇచ్చినా.. ఇక్కడ అద్భుతంగా తయారు చేసి ఇస్తారు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏలూరులో మాత్రమే చేనేత మగ్గాలపై తివాచీలు తయారు చేస్తారు. ఇవి 50 ఏళ్లకుపైగా మన్నిక ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసేవారు. యంత్రాలు రావడంతో 2002 నుంచి ఇక్కడి పరిశ్రమకు గడ్డుకాలం మొదలైంది. తక్కువ ధరకు ప్లాస్టిక్ కార్పెట్లు వస్తుండటంతో అందరూ వాటివైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఏలూరు తివాచీల గురించి తెలుసుకున్నవారు ఆర్డర్లు ఇస్తుండటంతో కొంతకాలం కిందట మంచి డిమాండ్ వచ్చిందని తయారీదారులు చెప్పారు. అంతలోనే కరోనా విజృంభించడంతో పరిశ్రమ కుదేలైందని వాపోయారు. తివాచీ నేత పనిలో నిమగ్నమైన కార్మికులు కరోనాతో దెబ్బ గతంలో 100 మందికి పైగా చేనేత కార్మికులు, 50 మంది ఎక్స్‌పోర్టర్లు, 20 మంది మాస్టర్ వీవర్లతో ఈ పరిశ్రమ కళకళలాడేది. ప్రభుత్వ సహాయ సహకారాలు అందడానికి వీలుగా ఏలూరు కార్పెట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ నేతృత్వంలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించడంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కొని వెళ్లిపోయారు. నైపుణ్యమున్న చేనేత కార్మికులు తగ్గిపోయారు. 10 మంది కార్మికులతోనే తక్కువ ఆర్డర్లతో నెట్టుకువస్తున్నారు. 6 గంటల పనికి రూ.300 ఇస్తున్నా కార్మికులు దొరకట్లేదని తయారీదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ హితం.. ఈ తివాచీలు పర్యావరణ హితమైనవని తయారీదారులు చెబుతున్నారు. ఊలు, కాటన్, జూట్‌తో పాటు సహజసిద్ధ రంగులు ఉపయోగిస్తామని తెలిపారు. 50 ఏళ్లకు పైగా మన్నిక ఉండే వీటిని మూడు నెలలకొకసారి శుభ్రం చేస్తే కొత్తగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. సాధారణ కార్పెట్ కంటే వీటి ధర కాస్త అధికం. ఇందులోనే 50 శాతం కూలి ఖర్చులు, 30 నుంచి 40 శాతం మెటీరియల్ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ తివాచీల్లో హానికర రసాయనాలు వినియోగిస్తారని.. ఇవి భూమిలో, సముద్రంలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మన్నిక రెండేళ్లే ఉంటుంది. కానీ ధర తక్కువ కావడంతో అందరూ ప్లాస్టిక్ వైపు వెళుతున్నారని చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే పని సిద్ధమైన తివాచీని ఫినిషింగ్ చేస్తుంటాను. ఫినిషింగ్ ఎంత బాగా చేస్తే అంత మన్నిక ఉంటుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. గతంలో చాలా సందడిగా ఉన్న మా పరిశ్రమ నేడు వెలవెలబోతుంటే చూడటం కష్టంగా ఉంది. – సత్యనారాయణ, ఫినిషింగ్ కార్మికుడు మాది ఐదోతరం కార్పెట్ తయారీ పరిశ్రమలో నేను ఐదో తరానికి చెందినవాడిని. పనినైపుణ్యంతో అనేక అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు ఆ వెలుగులు పోయాయి. ప్లాస్టిక్ కార్పెట్ వచ్చాక మా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మార్కెట్ కొంత మేర బాగానే ఉన్నప్పటికీ.. కార్మికులు దొరకట్లేదు. నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆన్లైన్ మార్కెటింగ్ విక్రయాలకు అవకాశం కల్పిస్తే ఈ రంగం కోలుకుంటుంది. – అబ్దుల్ నయీం, తయారీదారు -
బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు
కర్నూలు(సెంట్రల్) : బయట వాహనాల పొగ, దుమ్ము, ధూళితో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. దాన్నుంచి బయట పడడానికి ముఖానికి మాస్క్‌లు, చున్నీలు, రుమాళ్లు కట్టుకుంటాం. ఆయా కారకాల నుంచి అవి కాస్తంత ఉపశమనం కలిగిస్తాయి. ఇంట్లో కాలుష్యం ఉంటే ఎలా? మనం వాడే కొన్ని వస్తువుల వల్ల గృహాల్లోని గాలి కలుషితమవుతోంది మరి... ఇంట్లోని కాలుష్యం బయటి దానికన్నా ప్రమాదకరం.రోజు వాడే పదార్ధాలు, వస్తువులు, నిత్య అలవాట్లు వల్ల కాలుష్య కారకాలు విడదలవుతున్నాయి. రంగులు, వంటగ్యాస్, పెంపుడు జంతవుల వచ్చే అలర్జీలు, ఇంట్లోని కార్పెట్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మనదేశానికి చెందినవి 14 ఉన్నాయి. ఈ నగరాల్లో పీఎం2 కాలుష్య కారకంఎక్కుగా విడుదలవుతోంది. అంతర్గత వాతావరణ కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాదీ లక్షలాదిమంది మృతి చెందుతున్నారు. కాలుష్యం వల్ల శరీరంలోని చాలా భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా, వంట రుగ్మతలు వస్తాయి. వాతావరణ కాలుష్య కారకాలలను నియంత్రించచడం ఒక్కరి వల్ల అయ్యేపనికాదు. అయితే ఇంట్లో ఉన్న కాలుష్య కారకాలను నియంత్రించుకోవడం మనకు సాధ్యమే. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు. కొత్తగా చేసుకున్న అలవాట్లతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గతంలో ప్లాస్టిక్ వాడకంలేదు. ఇప్పుడు అది లేనిదే రోజు గడవదు. రంగులు, కార్పెట్లు ఇలా కొన్ని వస్తువులు ఇటీవలి జీవన పద్ధతులు ఇంట్లోకి చేరాయి. వీటిని దూరంగా ఉంచితే కాలుష్య నుంచి దూరంగా ఉన్నట్లే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా... పచ్చదనానికి అలవాటు పడాలి.. వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కలు. స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. అవి ఇంట్లో ఉంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కుండీల్లో పెంచే చిన్నచిన్న మొక్కలు , డ్వార్ఫ్ మొక్కలను ఇంటి లోపల పెంచుకోవాలి. దీనివల్ల ఇంటికి పచ్చదనం, ఆరోగ్యం రెండూ సమకూరతాయి. వెంటిలేషన్ ముఖ్యం... ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూడడం వల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి. దీని వల్ల నివాసాల్లోని చెడువాసన చక్కగా బయటకు వెళుతుంది. లోపల ఉన్న దుమ్ము, అలర్జీని కలిగించే కారకాలు గాలి లోపలికి బాగా వీయడంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలు సూక్ష్మ జీవులను సంహరిస్తాయి. వెంటిలేషన్ వల్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కార్పెట్లతో మరింత కాలుష్యం... ఇంట్లో వాడే కార్పెట్లు కాలుష్యకారకాలను పట్టి ఉంచుతాయి. కార్పెట్లలో పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్మ, ధూళి కణాలు చేరతాయి. వాటిని వ్యాక్యూమ్ క్లీనర్లతో శుభ్రం చేసేటప్పుడూఅయా కారకాలు ఇంట్లోని వాతావరణంలో చేరి వ్యాధులను కలగిస్తాయి. చిన్నపిల్లలు వీటిపై తిరిగితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్‌కి దూరంగా... ఆధునిక జీవన శైలితో ప్లాస్టిక్ ఇంట్లో భాగమైపోయింది. వీటి నుంచి వెలువడే ఉప ఉత్పన్నాలు కాలుష్యాన్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్ నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్స్ 0.1 ఎంఎం ఉంటాయి. సింథటిక్ కార్పొట్లు, ప్లాస్టిక్ డబ్బాలు తదితరలతో ఇవి ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ధూమపానం నిషిద్ధం.. ఇంట్లో పొగ తాగడం, వారికే కాకుండా మిగిలిన వారందరికీ హానికరం. ఈ విషయం అందరికీ తెలిసినా కొందరు పట్టించుకోరు. బయట తాగడం కన్నా ఇంట్లో ధూమపానం వల్ల ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. పొగ లోపలే ఉండిపోవడంతోమళ్లీ మళ్లీ పీల్చాల్సి వస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి వద్దే వద్దు... ఇంట్లో మంచి సువాసన రావడానికి వెలిగించే సుగంధ పుల్లలు(ధూప్‌స్టిక్స్) వల్ల కాలుష కారకాలు విడుదలవుతాయి. అవి వెదజల్లే పొగలో వివిద రసాయనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శ్వాస, చర్మ సమస్యలు వస్తాయి. ఇంట్లోని కాలుష్యం ప్రమాదకరం – అచ్యుతరామయ్య, పర్యావరణ శాస్త్రవేత్త ఇంటిలోపలి కాలుష్యం ప్రమాదకరంమైంది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, న్యుమోమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండడంతో వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేవిధంగా చూసుకోవాలి. ఆధునిక పోకడలను తగ్గించుకుంటే అంతర కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
కొత్తవాడ కార్పెట్లపై మనసుపడ్డ రంగమ్మత్త!
వరంగల్: కొత్తవాడలోని చేనేత కార్మికులు నేసే దర్రీస్(కార్పెట్లు)పై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మనసు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను వరంగల్‌కు చెందిన చేనేత కార్మిక సంఘాల నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు తదితరులు కలిసి కొత్తవాడ దర్రీస్ చూపించారు. ప్రస్తుతం 3లక్షల కార్పెట్లు పేరుకుపోయినందున కార్మికులకు అండగా నిలబడాలని కోరా రు. కార్మికుల పనితీరు, దర్రీస్ నాణ్యతను మెచ్చుకున్న ఆమె వీటిని కొనుగోలు చేయాలని సినీ నటులు, తన స్నేహితులను కోరతానని తెలిపారు.(అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన) -
ఇంటిని మెరిపిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఇంటి అందం ద్విగుణీకృతం కావాలంటే ఇల్లే కాదు ఇంట్లోని ఫర్నిచర్, ఫ్లోరింగ్, కర్టెన్లు, కార్పెట్లు, వంటింట్లో సామగ్రి కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లంత మెరుపులు మెరవాలంటే శుభ్రత కోసం కొంత సమయాన్ని కేటాయించకతప్పదు. ప్రణాళికాబద్ధంగా.. ఎలాంటి హడావుడి లేకుండా అలంకరించుకోవాలి సుమీ. ⇒ మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి. ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. ⇒ కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరక లు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. ⇒ గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు. ⇒ కొందరు మైక్రోఓవెన్‌ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికిపడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనిగర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. ⇒ బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడం తో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి.