ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఏపీలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐహెచ్)లో 1,186 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఏపీలో మొత్తం 2,698 టెక్స్‌టైల్ యూనిట్లు
పీఎం మిత్ర పథకంపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కరికాల వలవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్‌లో పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలతో పాటు టెక్స్‌టైల్ అప్పెరెల్ పాలసీ కింద మరిన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. టెక్స్‌టైల్ రంగానికి కీలకమైన పత్తిని ఏటా 2.2 మిలియన్ బేళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని.. అంతేకాక, సిల్క్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఏపీలో టెక్స్‌టైల్ క్లస్టర్లు ఉన్నాయని.. విశాఖలోని బ్రాండిక్స్ అప్పెరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, గుంటూరులోని టెక్స్‌టైల్ పార్క్, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అప్పెరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్‌టైల్ పార్క్, ఎంఎఎస్ ఫ్యాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ వంటి భారీ టెక్స్‌టైల్ పరిశ్రమలతో కలిపి మొత్తం 2,698 యూనిట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా రూ.4,957 కోట్ల పెట్టుబడితో 1,31,426 మందికి ఉపాధి లభిస్తోందని.. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పీఎం మిత్ర కింద రాష్ట్రంలో భారీ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కరికాల్ వలవన్ కోరారు.
టెక్స్‌టైల్ పార్క్‌కు కొప్పర్తి అనుకూలం
ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని ఏపీఐఐసీ వీసీ, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కొప్పర్తికి సమీపంలో కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీ లలితా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, శ్రీ గోవిందరాజ్ టెక్స్‌టైల్ లిమిటెడ్, ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్ వంటి పరిశ్రమలతోపాటు 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులతోపాటు, కడప, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు సమీపంలో ఇది ఉండటం ఎగుమతులకు కలసొచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొప్పర్తిలో ఒక టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. పరిశీలన కోసం త్వరలో రాష్ట్రానికి అధికారుల బృందం రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒక పార్క్‌తో లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి
టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్క్‌లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.4,445 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఒక పీఎం మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఏడు పార్కుల కోసం మొత్తం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment