mega textile park
-
కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో నవంబర్ లేదా.. డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యట్రిక్ ముఖ్యమంత్రి అయి మళ్లీ బాధ్యతలు చేపడతారని, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెప్పే చిల్లరమల్లర మాటలను కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చా రు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కులో కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న యూనిట్‌కి భారత్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్ఈ చంగ్ జే బాక్‌తో కలసి శనివారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్నారు. కేంద్రం కాపీ కొట్టింది.. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్రం అమలుచేస్తున్న పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే స్ఫూర్తి అని కేటీఆర్ అన్నారు. 2017లో మెగాటెక్స్‌టైల్ పార్కుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు కేంద్రం దానిని కాపీకొట్టి పీఎం మిత్ర తీసుకొచ్చిందన్నారు. ఫామ్ టు ఫ్యాషన్ అనే లక్ష్యంతో ఇక్కడే సమగ్రంగా వ్రస్తాలు తయారు కావాలన్న సంకల్పంతోపాటు గతంలో ఆజంజాహి మిల్లు ఉన్న సమయంలో వరంగల్‌కు ఉండే పేరు ప్రతిష్టలను మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పేలా సీఎం కేసీఆర్ కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక్కడ తయారయ్యే దుస్తులు దేశం కోసమే కాదు.. అమెరికా, యూరప్, కొరియా వంటి ప్రపంచ మార్కెట్లోకి వెళతాయన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ పేరుతో ప్రపంచ మార్కెట్లలోకి అమ్మకాలు ఉంటాయని చెప్పారు. యంగ్వన్ ద్వారా 21,000, కిటెక్స్ ద్వారా 12,000, గణేశ ద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతుందని.. దీనికి రెట్టింపుగా పరోక్ష ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే 99 శాతం ఉద్యోగాలు ఉంటాయని, ముఖ్యంగా మహిళలకు 80 నుంచి 85 శాతం ఉద్యోగాలు క ల్పించే దిశగా ఆయా కంపెనీలతో మాట్లాడామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కిటెక్స్ కంపెనీని సీఎం కేసీఆర్ సెపె్టంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది తెలంగాణ నేడు ఆచరిస్తున్నది.. దేశం రేపు అనుసరిస్తదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చే చాలా పథకాలకు తెలంగాణనే దిక్సూచి అయిందన్నారు. అంతకుముందు కొరియా రాయబారి హెచ్ఈ చంగ్ జే బాక్ మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ పెద్ద కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శ న్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, యంగ్వన్ కంపెనీ సీఈఓ కీహాక్ సంగ్ పాల్గొన్నారు. గిరిజనుల గుండెచప్పుడు కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కల నెరవేర్చడంతో పాటు గిరిజనులు, ఆదివాసీల చిర కాల డిమాండు ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే స్వయం పాలన కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ] ుంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీ ఆర్ ట్వీట్ చేశారు. గిరిజనుల గుండెచప్పుడు, ఆదివాసీల ఆత్మబంధువు కేసీఆర్ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
‘కొప్పర్తి’లో కేంద్ర బృందం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్–జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రతినిధులు హెచ్‌కే నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందుకాంత్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఏపీఐఐసీ అధికారుల బృందం శనివారం పర్యటించింది. ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు గల అనుకూలతలు మౌలిక వసతులను కేంద్ర బృందం పరిశీలించింది. పార్క్ అభివృద్ధికి అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలను సైతం వీక్షించింది. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి, టెక్స్టైల్స్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కేంద ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. పక్కనే విమానాశ్రయం ఉండటం.. కడప, తిరుపతి, బెంగళూరు విమానాశ్రయాలు సమీపంలోనే ఉండటం.. కృష్ణపట్నం, చెన్నై పోర్టులు సైతం అందుబాటులో ఉండటంతో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు మరింత అనుకూలమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. కృష్ణాపురం నుంచి కొప్పర్తి వరకు రైల్వేలైన్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు. ఇక్కడి నుంచి ఎగుమతుల కోసం ఏవియేషన్ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని సూచించారు. 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 1,186 ఎకరాల్లో ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద కొప్పర్తిలో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.1,100 కోట్లతో కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం మిత్ర కింద కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ విభాగం నుంచి పార్క్ అభివృద్ధికి 30 శాతం ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో జిల్లా పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి పేర్కొన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల 10 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. -
కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి: ఏపీలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐహెచ్)లో 1,186 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 2,698 టెక్స్టైల్ యూనిట్లు పీఎం మిత్ర పథకంపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కరికాల వలవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్‌లో పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలతో పాటు టెక్స్టైల్ అప్పెరెల్ పాలసీ కింద మరిన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగానికి కీలకమైన పత్తిని ఏటా 2.2 మిలియన్ బేళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని.. అంతేకాక, సిల్క్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్ క్లస్టర్లు ఉన్నాయని.. విశాఖలోని బ్రాండిక్స్ అప్పెరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, గుంటూరులోని టెక్స్టైల్ పార్క్, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అప్పెరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, ఎంఎఎస్ ఫ్యాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ వంటి భారీ టెక్స్టైల్ పరిశ్రమలతో కలిపి మొత్తం 2,698 యూనిట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా రూ.4,957 కోట్ల పెట్టుబడితో 1,31,426 మందికి ఉపాధి లభిస్తోందని.. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పీఎం మిత్ర కింద రాష్ట్రంలో భారీ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కరికాల్ వలవన్ కోరారు. టెక్స్టైల్ పార్క్‌కు కొప్పర్తి అనుకూలం ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని ఏపీఐఐసీ వీసీ, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కొప్పర్తికి సమీపంలో కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీ లలితా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, శ్రీ గోవిందరాజ్ టెక్స్టైల్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వంటి పరిశ్రమలతోపాటు 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులతోపాటు, కడప, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు సమీపంలో ఇది ఉండటం ఎగుమతులకు కలసొచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొప్పర్తిలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. పరిశీలన కోసం త్వరలో రాష్ట్రానికి అధికారుల బృందం రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక పార్క్‌తో లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్క్‌లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.4,445 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఒక పీఎం మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఏడు పార్కుల కోసం మొత్తం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. -
ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్‌ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్‌ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
దేశానికే తలమానికం
సాక్షి, హైదరాబాద్: దేశ టెక్స్టైల్స్ రంగానికే తలమానికంగా వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మెగా టెక్స్టైల్స్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కు అవుతుందని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట, చింతపల్లి గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కాకతీయ టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుపై శుక్రవారం మంత్రి కేటీఆర్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫైబర్ టు ఫ్యాషన్ పద్ధతిలో (నూలు పోగు నుంచి వస్త్రాల తయారీ వరకు) కావాల్సిన అన్ని అధునాతన వసతులను ఈ పార్కులో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు.. రాష్ట్రంలో నాణ్యమైన పత్తి దిగుబడి అయ్యే ప్రాంతాలకు చేరువుగా ఈ పార్కు ఉందన్నా రు. ఇక్కడ ఏర్పాటయ్యే టెక్స్టైల్స్ పరిశ్రమలు ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉంటాయన్నారు. ఈ పార్కులో దుస్తుల తయారీకి అవసరమైన ‘ప్లగ్ అండ్ ప్లే ఫ్యాక్టరీ’షెడ్లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అత్యుత్తమ టెస్టింగ్ లేబొరేటరీలతో పాటు పార్కు మొత్తం జీరో లిక్విడ్ డిశ్చార్జి విధానం అమలు అవుతుందన్నారు. దీంతో కాలుష్య సమస్య అంతగా ఉండదన్నారు. సమీప భవిష్యత్తులో ఔటర్‌రింగ్ రోడ్డుతో పాటు ఒక ఎయిర్ స్ట్రీప్ అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ఓ ముందడుగు పడిందన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు.. టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 12 కంపెనీలు, రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. దక్షిణకొరియాకు చెందిన యాంగ్వాన్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. సూర్య వంశీ, శ్రీనాథ్, సూర్యోదయ్ స్పిన్నింగ్ మిల్స్, శివానీ గ్రూప్, గిన్ని ఫిలామెంట్స్, స్వయంవర్ గ్రూప్, వెల్ స్పన్ గ్రూప్, గోకుల్ దాస్ ఇమేజేస్, నందన్ డెనీమ్, షాపర్స్ స్టాప్, చిరిపాల్ వంటి పలు కంపెనీలు మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. టెక్స్టైల్స్ పార్కుకు శంకుస్థాపన జరిపిన రోజే ఈ కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. దీంతో ప్రత్యక్షంగా 22 వేల మంది, పరోక్షంగా 44 వేల మంది కలిపి మొత్తం సుమారు 66 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పార్కుకు అనుబంధ పరిశ్రమల కోసం ఇతర ప్రాంతాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు మరో 8 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. డిజైన్ రెడీ.. కాకతీయ టెక్స్టైల్స్ పార్కు లోగో నమూనా, పైలాన్లను టీఎస్ఐఐసీ రూపొందించింది. టెక్స్టైల్ పరిశ్రమ ఉన్నతి, తెలంగాణ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని పైలాన్ తయారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పరిశ్రమకు ప్రాణమైన దారపు కండెను మధ్యలో ఉంచి దాని చుట్టూ రంగు రంగుల దారాల పోగులతో పైలాన్‌ను అకర్షణీయంగా తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను సూచించేలా పైలాన్ పైన గ్లోబ్ ఏర్పాటు చేశారు. -
16న మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన
ఉదయం 11 గంటలకు సీఎం చేతుల మీదుగా.. సాక్షి, హైదరాబాద్: వరంగల్ చరిత్ర మార్చే మరో ఘట్టానికి తెరలేవనుంది. స్థానికులకు ఉద్యోగం, నేతన్నకు ఉపాధి హామీనిచ్చే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్కుకు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల మధ్యలో ఈ పార్కు ఏర్పాటు చేయనున్నారు. రూ.1,150 కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ పార్కులో రూ.11,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే అంచనా వేశారు. ఈ పార్కు ద్వారా 1.3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రాష్ట్రం నుంచి బతుకుదెరువుకు వలస వెళ్లిన చేనేత కార్మికులు తిరిగొచ్చే అవకాశాన్ని ఈ మెగా టెక్స్టైల్ పార్కు కల్పించనుంది. 2014లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఈ పార్కుకు శంకుస్థాపన ద్వారా నెరవేరబోతోంది. పార్కులో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు తగిన వసతు లు కల్పించి, పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం ఇప్పటికే 1,190 ఎకరాల భూమి సేకరించారు. ఇందుకు ముందుకు వచ్చిన రైతులు, చొరవ తీసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
కుప్పం, పలమనేరులో.. మెగా టెక్స్టైల్ పార్క్
తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరులో మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.143 కోట్ల పెట్టుబడి పెట్టి కుప్పం, పలమనేరు, అనంతపురం జిల్లా హిందూపురంలో టెక్స్టైల్ పరిశ్రమల ఏర్పాటుకు సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమల వల్ల 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. వివరాలు.. జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేసి.. ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బెంగళూరు, చెన్నై నగరాలకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్క్‌లను ఏర్పాటుచేస్తే.. ఆర్థికపరంగా లాభసాటిగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కుప్పం, పలమనేరు, అనంతపురంజిల్లా హిందూపురంలోనూ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశాలను డిసెంబర్ 6, 9న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాల్లో సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమెటడ్ సంస్థ రూ.143 కోట్ల పెట్టుబడి పెట్టి.. కుప్పం, పలమనేరు, హిందూపురంలలో పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించింది. సాహీ సంస్థకు 2010-15 పారిశ్రామిక విధానంలో పేర్కొన్న రాయితీలను అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది. టెక్స్టైల్ పరిశ్రమకు రాయితీలు ఇవే.. కుప్పం, పలమనేరు, హిందూపురంలలో ఏడాదిలోగా పరిశ్రమల పనులను పూర్తిచేసి.. 11 వేల మందికి ఉపాధి కల్పిస్తేనే రాయితీలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టీకరించింది. ఎనిమిదేళ్లపాటూ ముడిసరుకులపై వంద శాతం వ్యాట్ రాయితీ కల్పిస్తారు. భూమి కొనుగోలు, లీజులకు సంబంధించి స్టాంప్ డ్యూటీ వంద శాతాన్ని రీయింబర్స్మెంట్ చేస్తారు. కొనుగోలు చేసిన భూమి విలువలో(ఎకరం గరిష్ఠంగా రూ.పది లక్షలు) 25 శాతాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఐదేళ్లపాటూ యూనిట్ విద్యుత్‌ను రూ.1కే సరఫరా చేస్తారు. స్థానిక యువతీ యువకుల్లో నైపుణాన్ని పెంపొందించే శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించినందుకు ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున సాహీ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది. వస్త్రాల ఉత్పత్తిలో పర్యావరణ పరిరక్షణకు వెచ్చించే మొత్తంలో 25 శాతాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఉపాధికి మార్గం.. పశ్చిమ మండలాల్లో వర్షాభావం వల్ల సేద్యం పడకేసిన నేపథ్యంలో లక్షలాది మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పలమనేరు, కుప్పంల్లో టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటుచేసి.. స్థానికులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించగలిగితే ఉపాధికి ఇబ్బందులు ఉండవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కుప్పం, పలమనేరు, హిందూపురంల్లో ఏర్పాటుచేసే పరిశ్రమల్లో ఏడాదికి 73.09 మిలియన్ల షర్ట్స్, ప్యాంట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఏడాదిలోగా ఆ పరిశ్రమలను సాహీ సంస్థ ఏర్పాటుచేస్తే యువతీయువకులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.