తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరులో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.143 కోట్ల పెట్టుబడి పెట్టి కుప్పం, పలమనేరు, అనంతపురం జిల్లా హిందూపురంలో టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటుకు సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమల వల్ల 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. వివరాలు.. జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేసి.. ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బెంగళూరు, చెన్నై నగరాలకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్క్‌లను ఏర్పాటుచేస్తే.. ఆర్థికపరంగా లాభసాటిగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కుప్పం, పలమనేరు, అనంతపురంజిల్లా హిందూపురంలోనూ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశాలను డిసెంబర్ 6, 9న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాల్లో సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమెటడ్ సంస్థ రూ.143 కోట్ల పెట్టుబడి పెట్టి.. కుప్పం, పలమనేరు, హిందూపురంలలో పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించింది. సాహీ సంస్థకు 2010-15 పారిశ్రామిక విధానంలో పేర్కొన్న రాయితీలను అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
టెక్స్‌టైల్ పరిశ్రమకు రాయితీలు ఇవే..
కుప్పం, పలమనేరు, హిందూపురంలలో ఏడాదిలోగా పరిశ్రమల పనులను పూర్తిచేసి.. 11 వేల మందికి ఉపాధి కల్పిస్తేనే రాయితీలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టీకరించింది.
ఎనిమిదేళ్లపాటూ ముడిసరుకులపై వంద శాతం వ్యాట్ రాయితీ కల్పిస్తారు.
భూమి కొనుగోలు, లీజులకు సంబంధించి స్టాంప్ డ్యూటీ వంద శాతాన్ని రీయింబర్స్‌మెంట్ చేస్తారు.
కొనుగోలు చేసిన భూమి విలువలో(ఎకరం గరిష్ఠంగా రూ.పది లక్షలు) 25 శాతాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
ఐదేళ్లపాటూ యూనిట్ విద్యుత్‌ను రూ.1కే సరఫరా చేస్తారు.
స్థానిక యువతీ యువకుల్లో నైపుణాన్ని పెంపొందించే శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించినందుకు ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున సాహీ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లిస్తుంది.
వస్త్రాల ఉత్పత్తిలో పర్యావరణ పరిరక్షణకు వెచ్చించే మొత్తంలో 25 శాతాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
ఉపాధికి మార్గం..
పశ్చిమ మండలాల్లో వర్షాభావం వల్ల సేద్యం పడకేసిన నేపథ్యంలో లక్షలాది మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పలమనేరు, కుప్పంల్లో టెక్స్‌టైల్ పరిశ్రమలు ఏర్పాటుచేసి.. స్థానికులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించగలిగితే ఉపాధికి ఇబ్బందులు ఉండవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కుప్పం, పలమనేరు, హిందూపురంల్లో ఏర్పాటుచేసే పరిశ్రమల్లో ఏడాదికి 73.09 మిలియన్‌ల షర్ట్స్, ప్యాంట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఏడాదిలోగా ఆ పరిశ్రమలను సాహీ సంస్థ ఏర్పాటుచేస్తే యువతీయువకులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
కుప్పం, పలమనేరులో.. మెగా టెక్స్‌టైల్ పార్క్
Published Sat, Jan 17 2015 9:11 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement