Kopparthi
-
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
Andhra Pradesh: ‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన మూడ్రోజుల పర్యటన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు. సంస్థల వివరాలు.. – అల్ డిక్సన్ టెక్నాలజీస్.. అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు. తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది. వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నోడోమ్ సంస్థ.. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు. -
కొప్పర్తిలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారంభోత్సవం
-
AP: కొప్పర్తికి రైల్వే లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను అనుసంధానిస్తూ కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తోంది. కొప్పర్తికి సమీపంలోని కృష్ణాపురం రైల్వే స్టేషన్ నుంచి కొప్పర్తి వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌ను అనుసంధానిస్తూ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేయనున్నారు. పీఎం గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) పథకం కింద ఈ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సృజన తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కు నుంచి సులభంగా సరుకు ఎగుమతి, దిగుమతి చేసుకునేలా కృష్ణాపురం ప్రధాన లైన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ప్రత్యేక లైన్ నిర్మిస్తారు. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పారిశ్రామిక పార్కులో నిర్మించే గోడౌన్లను సైడింగ్ లైనుతో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రధాన లైన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా సరుకు రవాణా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్‌కు ఏపీఐఐసీ టెండర్లును ఆహ్వానించింది. కొప్పర్తిలో ఈ రైల్వే సైడింగ్‌తో పాటు రూ.100.18 కోట్లతో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా, రూ.21 కోట్లతో అభివృద్ధిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేంద్రానికి త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. -
పారిశ్రామిక హబ్‌గా వైఎస్సార్ జిల్లా.. 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సాక్షి, కడప: కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమల స్థాపన వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు పరిశ్రమలు ఇక్కడికి తరలి రాగా, మరికొన్ని కొత్త పరిశ్రమలు కొప్పర్తి కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేటు లిమిటెడ్ (టెక్ప్సోపోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) పరిశ్రమ సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.46 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. 2050 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే సదరు కంపెనీ కొప్పర్తిలో స్థలం కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకోగా ఈ మేరకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొప్పర్తిలో 165, 167, 168 ప్లాట్ల పరిధిలో 21.17 ఎకరాల స్థలాన్ని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమకు కేటాయించింది. భవిష్యత్తులో అవసరమైతే మరికొంత స్థలాన్ని ఇచ్చేందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది. దీంతో సదరు కంపెనీ కొప్పర్తిలో పరిశ్రమ పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాదిలో గార్మెంట్ పరిశ్రమ ఉత్పత్తులు ప్రారంభించనుంది. మల్టీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మల్టీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇక్కడ మిక్సింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ మార్క్‌ఫెడ్ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. మిక్సింగ్ ప్లాంటు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామిక వాడను సందర్శించారు. పారిశ్రామికవాడలోని ప్లాట్ నెంబరు 15ను కేటాయించాలని కోరగా అందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు వద్ద స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పులివెందులలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులో రూ. 110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్, ఇదే ప్రాంతంలో రూ. 600 కోట్లతో అపాచీ కంపెనీ లెదర్ పరిశ్రమ బూట్లు, పాదరక్షల తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 4000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కొప్పర్తి ప్రాంతంలో జిల్లా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా రూ.1580 కోట్ల వ్యయంతో అధునాతన వసతులు కల్పిస్తూ 3167 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేశారు. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ప్రారంభించారు. దీంతో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి జాతీయ రహదారిలో గోపవరం వద్ద సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమను కంపెనీ నెలకొల్పుతోంది. రూ.1600 కోట్ల పెట్టుబడులతో 589 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మూడు వేల మందికి ఉద్యోగాలు, 4000 మంది రైతులకు ఉపాధి లభించనుంది. మొత్తంగా జిల్లాలో వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల పరిధిలో 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక హబ్‌గా జిల్లా వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే కొప్పర్తి, పులివెందుల, గోపవరం ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నింటిలో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సీఎం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టనుంది. – రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ సలహాదారు, కడప. -
కొప్పర్తిలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్.. 30,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్‌గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు. నిజానికి.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్ రంగాలకు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్‌ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్‌ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 30,000 మందికి ఉపాధి ఇక ఈ తయారీ జోన్ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్‌ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి: ఏపీలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐహెచ్)లో 1,186 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 2,698 టెక్స్టైల్ యూనిట్లు పీఎం మిత్ర పథకంపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కరికాల వలవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్‌లో పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలతో పాటు టెక్స్టైల్ అప్పెరెల్ పాలసీ కింద మరిన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగానికి కీలకమైన పత్తిని ఏటా 2.2 మిలియన్ బేళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని.. అంతేకాక, సిల్క్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్ క్లస్టర్లు ఉన్నాయని.. విశాఖలోని బ్రాండిక్స్ అప్పెరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, గుంటూరులోని టెక్స్టైల్ పార్క్, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అప్పెరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, ఎంఎఎస్ ఫ్యాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ వంటి భారీ టెక్స్టైల్ పరిశ్రమలతో కలిపి మొత్తం 2,698 యూనిట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా రూ.4,957 కోట్ల పెట్టుబడితో 1,31,426 మందికి ఉపాధి లభిస్తోందని.. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పీఎం మిత్ర కింద రాష్ట్రంలో భారీ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కరికాల్ వలవన్ కోరారు. టెక్స్టైల్ పార్క్‌కు కొప్పర్తి అనుకూలం ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని ఏపీఐఐసీ వీసీ, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కొప్పర్తికి సమీపంలో కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీ లలితా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, శ్రీ గోవిందరాజ్ టెక్స్టైల్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వంటి పరిశ్రమలతోపాటు 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులతోపాటు, కడప, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు సమీపంలో ఇది ఉండటం ఎగుమతులకు కలసొచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొప్పర్తిలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. పరిశీలన కోసం త్వరలో రాష్ట్రానికి అధికారుల బృందం రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక పార్క్‌తో లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్క్‌లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.4,445 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఒక పీఎం మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఏడు పార్కుల కోసం మొత్తం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. -
CM YS Jagan: విప్లవం సృష్టిస్తున్నాం
సాక్షి, కడప/బద్వేలు/గోపవరం/అట్లూరు: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 75 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాయలసీమ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం ఆయన ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.515.90 కోట్లతో ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గోపవరం మండలంలో రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం కడప సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, మరో 3,167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటిలో రూ.1,580 కోట్లతో వసతులు కల్పిస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన నాలుగు షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటైందని, ఏప్రిల్ నాటికి 1800 మందికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. 50 మంది అక్క చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చామని, వాళ్లంతా శిక్షణ పూర్తయ్యాక ఇక్కడే పని చేస్తారని చెప్పారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. మరెన్నో సంస్థలు ► మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్. రెండవది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ. మూడవది సెలకాన్ రెజుల్యూట్ సంస్థ. నాలుగవది చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్, ఐదవది యూటీఎస్‌పీఎల్. ఆరవది డిక్సన్ రెండవ ప్లాంట్. ► ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించాం. ఈ పరిశ్రమల ద్వారా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ► వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్కులోనే జరగబోతోంది. కార్బన్ మెగా టౌన్షిప్ మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిధులు రాయలసీమ రూపురేఖలు మార్చేలా.. ► వీవీడీఎన్ సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్‌డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్, మ్యానిఫ్యాక్చరింగ్ చేయబోతోంది. ఇదే పార్కులో మరో 18 ఎంఎస్ఎంఈల ప్రారంభానికి కూడా శిలాఫలకాలు వేస్తున్నాం. ► రాయలసీమ ఎన్విరాన్‌కేర్, బీఎస్ ల్యాబొరేటరీ, స్వర్ణముఖి కాంక్రీట్ రూ.84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ► చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలని, మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకవైపు కొప్పర్తి, మరొకవైపు నెల్లూరు, చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీసిటీ.. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. మీ అందరికీ అందుబాటులో ఉంటాం ► ఎలక్ట్రానిక్స్ ఎంఎస్ఎంఈ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కొప్పర్తిని ఎంచుకున్నందుకు పారిశ్రామిక వేత్తలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మద్దతుగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తాం. పరిశ్రమలు ఇక్కడికి రావడానికి పరిశ్రమల శాఖ నుంచి సుబ్రమణ్యం, నందకుమార్, జయలక్ష్మి చాలా కృషి చేశారు. వీరంతా మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ► సీఎంఓ నుంచి సోలోమన్ కూడా మీతో ప్రారంభం నుంచి సంప్రదింపులు చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం వచ్చినా ఒక్క ఫోన్‌కాల్ ద్వారా అందుబాటులో ఉంటాం. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ఇస్తామని చెప్పిన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇన్సెంటివ్‌ల గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రజలు సెంచురీ ఫ్లై వుడ్‌తో 6 వేల మందికి ఉపాధి ► వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలోని గోపవరంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో యువతకు ఉపాధి, రైతుల ప్లాంటేషన్‌కు గిట్టుబాటు ధర లభిస్తుంది. దేశంలోనే అతి పెద్దదైన వుడ్ పరిశ్రమ బద్వేలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ దగ్గ విషయం. ► దీంతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు సాగు చేస్తున్న సుబాబుల్ కర్రలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యవసాయ హబ్‌తో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి. ► రైతులు సైతం తమ భూములు ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సెంచురీ ఫ్లై బోర్డ్స్ లిమిటెడ్ (పీసీఐఎల్) యాజమానులు సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు. ► బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రూ.6 కోట్లతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. కాశినాయన మండల కేంద్రంలో నూతనంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బద్వేలు ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. లక్షాధికారులుగా రైతులు ► గోపవరం జాయింట్ ఫార్మింగ్ కో ఆపరేటివ్ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు. ► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు. ► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ ఛైర్మన్ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం విజన్‌తోనే ముందుకు వచ్చాం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు. మేము మొదట సెంచురీ ప్లై్లౖవుడ్ కంపెనీని తమిళనాడు లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే సీఎం జగన్ మమ్మల్ని ఒప్పించి, అనువైన ప్రాంతాన్ని చూపించి అన్ని రకాలుగా అండగా నిలుస్తుండటంతో గోపవరంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,600 కోట్లు కాగా, మొదటి విడతలో రూ.800 కోట్లు పెడుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేలమందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రైతులకు కనీసం 50 శాతం ఆదాయం పెరిగే అవకాశముంది.మొదటి దశలో ఎండీఎఫ్ వుడ్స్ తయారీ పరిశ్రమను రూ.600 కోట్లతో, లామినేటెడ్ వుడ్స్ పరిశ్రమను రూ.200 కోట్లతో చేపడతాం. ఎండీఎఫ్ను 18 నెలల్లో, లామినేటెడ్ వుడ్స్‌ను 15 నెలల్లో పూర్తి చేస్తాం. రెండో విడతలో రూ.200 కోట్లతో ప్లైవుడ్స్, రూ.600 కోట్లతో పార్టికల్ బోర్డ్ వ్యాపారాన్ని చేపడతాం. ఇవి 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. – సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్, సెంచురీ ప్లైవుడ్ కంపెనీ యజమానులు -
75వేల మందికి ఉద్యోగాలు
-
వైఎస్ ఆర్ ఈఎంసీ ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
పారిశ్రామిక ప్రగతిలో కలికితురాయి ‘కొప్పర్తి’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక దశ, దిశను మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. తక్షణం వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా అభివృద్ధి చేసిన షెడ్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన ఈ రెండు పారిశ్రామిక పార్కులను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఈఎంసీలో దాదాపు 28 యూనిట్లు రూ.1,052 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటి ద్వారా సుమారు 14,100 మందికి ఉపాధి లభించనుంది. కొప్పర్తిలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను ఉత్పత్తి ప్రారంభించడం కోసం ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ యూనిట్లో సెక్యూరిటీ సర్వైలైన్స్ సిస్టమ్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ ఏర్పాటయ్యే మరికొన్ని కంపెనీలు ► డిక్సన్.. 1200 మందికి ఉద్యోగాల కల్పన. టీవీలు, ల్యాప్టాపులు, ఐఓటీ పరికరాల తయారీ. ► సెల్కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్.. 1500 మందికి ఉద్యోగాలు. స్మార్ట్ఫోన్లు, మొబైల్ హ్యాండ్సెట్లు, ట్యాబ్లెట్లు, పీసీ యాక్ససరీలు, సెట్‌టాప్ బాక్సులు, గిగాబైట్ ఎథర్నెట్ ఆప్టికల్ నెట్వర్క్ (జీపీఓఎన్) తయారీ. ► ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్ ప్రైజస్.. 1,300 మందికి ఉద్యోగాలు. పవర్ బ్యాంక్స్, కేబుల్స్, చార్జర్లు, హెడ్‌ఫోన్స్, డిజిటల్ బోర్డుల తయారీ. ► యూటీఎన్పీఎల్ కంపెనీ.. 500 మందికి ఉద్యోగాలు.. మొబైల్ ఫోన్లు, చార్జర్లు, తదితర పరికరాల తయారీ. ► వీవీడీఎన్ టెక్నాలజీస్.. రూ.365 కోట్ల పెట్టుబడితో 5,400 మందికి ఉద్యోగాలు. 5జీ, ఏఐ, ఎంఐ, బ్లాక్ చెయిన్, బిగ్ డేటా, అనలిటిక్స్ రంగంలో ఉత్పత్తులు. ► బ్లాక్ పెప్పర్, హార్మనీ కంపెనీలు.. రూ.1800 కోట్ల పెట్టుబడులతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు. ► ఎంఎస్ఎంఈ కంపెనీలకు కూడా ప్రాధాన్యత. రూ.84.29 కోట్లతో 18 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు. భూములు అప్పగింత ద్వారా ఈ యూనిట్ల పనులు ప్రారంభం కానున్నాయి. ► ఇండస్ట్రియల్ ప్రమోషన్‌తోపాటు, ఈఎంసీలో పెట్టుబడులకు అవకాశాలను తెలియజెప్పడం ద్వారా కంపెనీలను ఆకర్షించడానికి తైవాన్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్, బిజినెస్ రష్యా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంఎస్ఎంఈ, ఎల్సీనా, ఐఈఎస్ఏ, ఐపీసీఏ, సీపీపీఏలతో ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకోనుంది. -
కొప్పర్తిలో భారీ టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని.. అక్కడ భారీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రికి గౌతమ్‌రెడ్డి గురువారం పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి కొప్పర్తిలో ఏర్పాటుచేయాలన్నారు. విద్యుత్ ఉపకరణాల తయారీకి మన్నవరం అనుకూలం అలాగే, భారీ విద్యుత్ ఉపకరణాల యూనిట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా మన్నవరం అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేకపాటి కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 2008లో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల యూనిట్‌ను ఏర్పాటుచేశారని.. ఇందుకోసం ఏపీఐఐసీ 750 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గోయల్ దృష్టికి గౌతమ్‌రెడ్డి తీసుకొచ్చారు. కానీ, బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో 2015 నుంచి ఈ యూనిట్ మూతపడి ఉందని.. దీనిని భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్‌కు పరిశీలించాలని కూడా కోరారు. కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం కింద దేశంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు భారీ విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాల జోన్లలో ఒకటి మన్నవరంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీయుష్ గోయల్.. త్వరలోనే ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. రైల్వే కారిడార్‌ను ఏపీలోనూ చేపట్టాలి ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతం ఏడీబీ 80, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతంగా ఉందని.. రాష్ట్ర వాటాను 10 శాతానికి తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరారు. అలాగే, రక్షణ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న రైల్వే కారిడార్‌ను రాష్ట్రంలో కూడా చేపట్టాల్సిందిగా మేకపాటి విజ్ఞప్తి చేశారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గతిశక్తి మిషన్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకోవచ్చని సూచించారు. త్వరలో విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో ఏర్పాటుచేసిన మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పీయూష్ గోయల్‌ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్‌తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. -
AP: ‘కొప్పర్తి’ పరిశ్రమలకు అన్నీ చౌకే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు బ్రాండింగ్‌పై ఏపీఐఐసీ దృష్టిసారించింది. కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్జేఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్‌ఈఎంసీ)లలో భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వీటి ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించింది. కొప్పర్తి పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గుతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, అభివృద్ధి చేస్తున్న మౌలికవసతులు వంటి విషయాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించింది. నాలుగు విధాలుగా తగ్గనున్న వ్యయం దేశంలోని ఇతర పారిశ్రామిక పార్కులతో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు నిర్వహణ వ్యయం భారీగా తక్కువగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ఇతర రాష్ట్రాల కంటే చౌకగా భూమి, విద్యుత్, నీరుతో పాటు చౌకగా కార్మికులు అందుబాటులో ఉన్న విషయాన్ని ఏపీఐఐసీ గణాంకాలతో వివరించింది. దేశంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో సగటున ఎకరం ధర రూ.85 లక్షలు ఉంటే ఇక్కడ రూ.25 లక్షలకే కావాల్సినంత భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల పెట్టుబడిలో భూ వ్యయం 64 శాతం తగ్గనుంది. అదేవిధంగా యూనిట్ల నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్‌ను కూడా చౌకగా అందిస్తోంది. దేశంలో సగటు పారిశ్రామిక యూనిట్ ధర రూ.8.2గా ఉంటే వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో 21 శాతం తక్కువగా యూనిట్ రూ.5.5కే అందిస్తున్నారు. అదే వైఎస్సార్ఈఎంసీలో అయితే యూనిట్ రూ.4.5కే ఇస్తున్నారు. అంటే దేశ సగటుతో పోలిస్తే 45 శాతం చౌకగా వైఎస్సార్ఈఎంసీలో విద్యుత్‌ను అందిస్తున్నారు. దేశంలో సగటున కిలోలీటరు నీటిని రూ.70కి ఇస్తుంటే 24 గంటలు కావాల్సినంత నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి రూ.55కే ఇస్తున్నారు. దీనివల్ల నీటి నిర్వహణ వ్యయం 15 శాతం తగ్గనుంది. దేశంలో సగటున కార్మికులకు నెలకు రూ.8,500 కూలి లభిస్తుంటే ఇక్కడ రూ.7,500కు కావాల్సినంతమంది అందుబాటులో ఉన్నారు. ఈ నాలుగు అంశాలే పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించనున్నాయని ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. కలిసొచ్చే అంశాలు 6.. కొప్పర్తి పారిశ్రామికవాడలో పెట్టుబడులకు మరో ఆరు అంశాలు కలిసివస్తాయని ఏపీఐఐసీ ఆ పుస్తకంలో పేర్కొంది. పూర్తిగా పర్యావరణ అనుమతులు పొందిన 6,914 ఎకరాలు అందుబాటులో ఉండటం, నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకునే విధంగా రెడీ టు బిల్డ్ షెడ్లతో పాటు రోజుకు 46 ఎంఎల్డీ నీరు, 132 కేవీ సబ్‌స్టేషన్, 2.6 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం, ఆరు, నాలుగు, రెండు లైన్ల రహదారులు వంటి అనేక మౌలికవసతులు కల్పిస్తున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే 50 వేలమందికిపైగా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కార్గో సర్వీసుల కోసం ప్రత్యేక టెర్మినల్ కలిసొచ్చే అంశం. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో ఇతర ప్రయోజనాలు ఇవేగాకుండా వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్‌చేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వైఎస్సార్ ఎంఐహెచ్ పాలసీ–2020–23ని విడుదల చేసింది. అలాగే వైఎస్సార్ ఈఎంసీలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించే యూనిట్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ► 100 శాతం స్టాంప్/ట్రాన్సఫర్ డ్యూటీ తిరిగి చెల్లింపు ► ప్రాజెక్టు విలువలో 20 శాతం చొప్పున గరిష్టంగా రూ.10 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ► అదే మైనార్టీలు అయితే 25 శాతం చొప్పున గరిష్టంగా రూ.25 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ► సరుకు రవాణా వ్యయంలో 25 శాతం చొప్పున ఏడాదికి రూ.50 లక్షల వరకు.. ఐదేళ్లు ఇస్తారు ► ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ చొప్పున ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు చెల్లింపు ► ఐదేళ్లపాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ సబ్సిడీ ► ఎనిమిదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు -
కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు
కొప్పర్తి నుంచి సాక్షి, ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి రూపు రేఖలను మార్చే మరో భారీ పారిశ్రామిక పార్కు శరవేగంగా అందుబాటులోకి వస్తోంది. శంకుస్థాపనలు, ఎంవోయూలు అంటూ ఆర్భాటాలు, హడావుడి లేకుండా నేరుగా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే విధంగా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో భారీ పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఒకపక్క కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ కేవలం 9 నెలల్లోనే యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వ చొరవతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కడప నగరానికి కూతవేటు దూరంలో సుమారు 6,914 ఎకరాల్లో ఏకకాలంలో నాలుగు పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనుండగా మిగిలిన 4,318 ఎకరాల్లో ఏపీఐఐసీ మూడు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. 3,164 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులుగా ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు పార్కులకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా 132 కేవీ సబ్‌స్టేషన్, రహదారులు, మురుగునీటి కాలువలు లాంటి మౌలిక వసతులను ఏపీఐఐసీ అభివృద్ధి చేయడంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మిగతా 249 ఎకరాల భూమిని ఇతర పారిశ్రామిక ఎకరాలకు వినియోగించనున్నారు. దసరా నాటికి కొప్పర్తి పారిశ్రామిక పార్కులో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 6,914 ఎకరాలు అందుబాటులోకి వస్తే కొప్పర్తిలో సుమారు రూ.60,200 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. క్యూ కడుతున్న కంపెనీలు బాగా వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కును ప్రతిపాదించారు. ఆయన హఠాన్మరణం అనంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే కొప్పర్తి పారిశ్రామిక పార్కుపై దృష్టి సారించారు. ఒకపక్క మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే మరోపక్క పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీంతో పలు సంస్థలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 47 కంపెనీలకు 430 ఎకరాలను కేటాయించారు. ఇందులో నాలుగు భారీ యూనిట్లు ఉండగా మిగిలిన 43 ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవి. 47 యూనిట్ల ద్వారా రూ.1,837 కోట్ల మేర పెట్టుబడులు, 8,941 ఉద్యోగాలు రానున్నాయి. వైఎస్సార్ ఈఎంసీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు భారీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ముఖ ద్వారం నమూనా కొప్పర్తికి కలిసొచ్చే అంశాలివే.. రోడ్లు, రైలు మార్గం, విమానాశ్రయం, పోర్టు.. ఇలా అన్ని ప్రధాన రవాణా మార్గాలు ఉండటం కొప్పర్తి పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారి 40గా వ్యవహరించే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకొని కడప–పులివెందుల రహదారికి ఇరువైపులా కొప్పర్తి పారిశ్రామికపార్కు విస్తరించి ఉంది. కేవలం పది కిలోమీటర్ల లోపే కడప విమానాశ్రయం ఉంది. ఈ పారిశ్రామిక పార్కు గుండా కడప–బెంగళూరు రైల్వేలైన్ ఉంది. 200 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు, 270 కి.మీ దూరంలో చెన్నై పోర్టు ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటన్నిటికంటే వైఎస్సార్ కడప జిల్లాలో బెరైటీస్, ఐరన్ ఓర్, క్వారŠజ్ట్, వైట్ క్లే లాంటి అనేక ఖనిజాలు లభ్యం కావడం కూడా వీటి ఆథారిత యూనిట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. 2011 లెక్కల ప్రకారం వైఎస్సార్ కడప జిల్లా జనాభా 28,82,469 కాగా 9 పాలిటెక్నిక్ కాలేజీలు, 24 ఇంజనీరింగ్ కాలేజీలు, 49 డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం అదనపు ఆకర్షణ. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు గండికోట రిజర్వాయర్ నుంచి శాశ్వత ప్రాతిపదికన ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలుత సోమశిల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించినా పెన్సుల నరసింహస్వామి అభయారణ్యం ద్వారా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో అనుమతుల్లో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో గండికోట నుంచి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏడాదిలోగా శాశ్వత నీటి వసతి కల్పించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది. కొప్పర్తి సమీపంలోనే పాపాగ్ని, పెన్నా నదులు ఉండటంతో భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదు. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీ వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌తో 2.5 లక్షల మందికి ఉపాధి వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో 3,164 ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కు ద్వారా కనీసం రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు ప్రత్యేక రాయితీలతో పాటు తొలి ఐదు యాంకర్ కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలను అందిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపుతో పాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీ లాంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను కేటాయించారు. ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చిన ప్రముఖ ఫర్నిచర్ తయారీ సంస్థ నీల్ కమల్‌కు 105 ఎకరాలను కేటాయించారు. బల్క్‌డ్రగ్స్, మెట్రోరైల్ విడిభాగాలు తయారీ, సిమెంట్ పైపుల నిర్మాణం, స్టేషనరీ లాంటి అనేక యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు. ఇందులో చాలావరకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు చెందిన యూనిట్లు ఉండటం గమనార్హం. వైఎస్సార్ ఈఎంసీలో నిర్మించిన ఫ్యాక్టరీ షెడ్లు రూ.748 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించిన ఎలక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2 పథకంలో భాగంగా దేశంలో అనుమతులు పొందిన తొలి ప్రాజెక్టు వైఎస్సార్ ఈఎంసీ. మొత్తం 801 ఎకరాల్లో విస్తరించిన వైఎస్సార్ ఈఎంసీలో తొలిదశలో రూ.748 కోట్లతో 540 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో యూనిట్లు తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ఒకొక్కటి 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం నాలుగు రెడీ టు బిల్డ్ షెడ్లు సిద్ధమయ్యాయి. ఇందులో రెండు షెడ్లను డిక్సన్ కంపెనీకి, రెండు షెడ్లను కార్బన్ మొబైల్స్‌కు కేటాయించనున్నారు. ఇవేకాకుండా సోలార్ పీవీ మాడ్యూల్స్, ఈవీ బ్యాటరీస్, మొబైల్ ఫోన్ ప్యానల్స్, ఏసీలు, వాషింగ్‌మెషీన్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంఎస్ఈ–సీడీపీ కింద రూ.14 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 98 ప్లాట్స్‌ను అభివృద్ధి చేసి యూనిట్లకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా రూ.200 కోట్ల విలువైన పెట్టుబడులు, 3,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిక్‌డిక్ట్ నిధులతో పారిశ్రామిక పార్కు కొప్పర్తి సౌత్ నోడ్‌లో 2,595.74 ఎకరాల్లో నిక్‌డిట్ నిధులతో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి మాస్టర్ పాŠల్న్ సిద్ధమైంది. ఆమోదం కోసం దీన్ని నిక్డిట్కు సమర్పించారు. మాస్టర్‌ప్లాన్ ఆమోదం తర్వాత కొప్పర్తి సౌత్ నోడ్ పనులు ప్రారంభమవుతాయి. ఈ పార్కు ద్వారా సుమారు రూ.25,000 కోట్ల పెట్టుబడులు, రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రాధమికంగా అంచనా వేశారు. 250 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సిటీ.. కొప్పర్తిలో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగులు అక్కడే నివాసం ఉండే విధంగా అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ సిటీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డార్మెటరీల దగ్గర నుంచి లగ్జరీ అపార్ట్మెంట్ల వరకు అన్ని తరగతులు వారు నివసించేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు ఆస్పత్రులు, మాల్స్, స్కూల్స్, 3 స్టార్ నుంచి 5 స్టార్ దాకా హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 250 ఎకరాల్లో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేడ్ సిటీ అభివృద్ధికి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. పారిశ్రామిక పార్కును ప్రారంభించే రోజే సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందికి ఉపాధి ... పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించి కొప్పర్తి పారిశ్రామికవాడను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. గత సర్కారు మాదిరిగా హంగులు, ఆర్భాటాలు లేకుండా భారీ పారిశ్రామిక పార్కును సిద్ధం చేస్తున్నాం. లక్షల మందికి ఉపాధి కల్పించే శక్తి కొప్పర్తికి ఉంది. రానున్న రోజుల్లో కొప్పర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో సందేహం లేదు. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నిర్వహణ వ్యయం చాలా తక్కువ.. ఇక్కడ ఏర్పాటయ్యే యూనిట్ల నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండేలా వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈఎంసీలో యూనిట్ రూ.4.50కే విద్యుత్ అందిస్తున్నాం. ఈ ధరకే నేరుగా బిల్లింగ్ చేయడం వల్ల ప్రతి యూనిట్‌కు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. తక్కువ ధరకే భూమి, నీటిని కూడా అందించడం కలిసొచ్చే అంశం. కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తుది అనుమతులు పొందిన నాలుగు నెలల్లోనే ఈఎంసీని అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. – నందకిషోర్, సీఈవో, వైఎస్సార్ ఈఎంసీ సొంత ప్రాంతంలో యూనిట్ గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల్లో పనిచేశా. ఆ అనుభవంతో సొంతంగా బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నా. తెలంగాణాలో ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి 70 లక్షలు పెడితే కానీ దొరికే అవకాశం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేస్తుండటం, ఇది మా సొంత ప్రాంతం కావడంతో ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించా. తొలిదశలో రూ.6 కోట్లతో బీఎస్ ల్యాబ్‌రేటరీస్ పేరుతో బల్క్ డ్రగ్ ఫార్మాను ఏర్పాటు చేశా. ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో కేవలం ఆరునెలల్లోనే యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ యూనిట్ ద్వారా కనీసం 150 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. –బి.శ్రీనివాసులురెడ్డి, బీఎస్ ల్యాబ్స్ మేనేజింగ్ పార్టనర్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్వర్ణముఖి కాంక్రీట్స్ పేరుతో కొప్పర్తిలో 2 ఎకరాల్లో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నా. ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.6 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 25 మందికి ఉపాధి లభించనుంది. రెండేళ్లలోనే కొప్పర్తి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందింది. – ఎన్.మహేందర్‌రెడ్డి, ఎండీ, స్వర్ణముఖి కాంక్రీట్స్ -
కొప్పర్తిలో కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలోగా వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపుతోపాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీ లాంటి పలు రాయితీలు అందచేస్తోంది. ఇక్కడి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే తొలి కంపెనీగా ‘పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. రెండో కంపెనీగా నీల్కమల్ లిమిటెడ్ రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి జూన్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, నీల్కమల్ ఇండియాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం రూ.పది లక్షల చొప్పున 117.85 ఎరాల కేటాయింపు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఎకరం ధరను ఏపీఐఐసీ రూ.25 లక్షలుగా నిర్ణయించగా తొలి కంపెనీ కావడంతో పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు ప్రత్యేక రాయితీ కింద ఎకరం రూ.10 లక్షల చొప్పున మొత్తం 117.85 ఎకరాలను కేటాయించారు. నీల్‌కమల్‌కు 105 ఎకరాలు కేటాయించారు. స్టాంపు డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చారు. ► తొలి 8 సంవత్సరాలు లేదా ఎఫ్‌సీఐ పరిమితి 100 శాతం ఇందులో ఏది ముందు అయితే అప్పటివరకు 100 శాతం ఎస్జీఎస్టీ నుంచి మినహాయింపు. ► స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. గరిష్టంగా రూ.10 కోట్లు ► ఏడాదికి 5 శాతం వడ్డీ రాయితీ గరిష్టంగా రూ.1.50 కోట్లు ► తొలి ఐదేళ్లు విద్యుత్ చార్జీ యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లిస్తారు. ► తొలి ఐదేళ్లు లాజిస్టిక్ సబ్సిడీ అందిస్తారు. ఏటా గరిష్టంగా రూ.50 లక్షలు చొప్పున దేశీయ రవాణాలో 25 శాతం సబ్సిడీ కల్పిస్తారు. -
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని తెలిపారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. (చదవండి: శరవేగంగా కడప ఉక్కు పనులు) కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల ఉద్యోగాలు: సీఎం జగన్ అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు అధికారులు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేవించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్నారు. -
నిర్నిద్రం
చీకటనీ వెలుతురనీ రెండుంటాయంటాం కానీ ఉండేది చీకటే వెలుతురు వచ్చి వెళుతుంది శబ్దాన్నీ నిశ్శబ్దాన్నీ వేరు పరుస్తాం కానీ ఉండేది నిశ్శబ్దమే దాన్ని భగ్నం చేస్తే శబ్దం పుడుతుంది నిద్దురనీ మెలకువనీ రెండు స్థితులు చెబుతాం కానీ ఉండేది నిద్దురే ముందు నిద్ర వెనుక నిద్ర చిరంతన నిద్ర ఆద్యంతాలు లేని నిద్రలో జీవితం ఒక ఉలికిపాటు -కొప్పర్తి (యాభై ఏళ్ల వాన’ సంపుటిలోంచి; ప్రచురణ: 2014; ప్రచురించిన కవిత 2006లో రాసింది.) -
అనుమానమే పెనుభూతమై..
- భార్యను కడతేర్చిన భర్త చింతకొమ్మదిన్నె : కడప నగర శివార్లలోని కొప్పర్తి సమీపంలో ఉన్న హరీంద్రనగర్‌లో ఆదివారం ఉదయం ఐదు నెలల గర్భిణిని ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. అనుమానమే ఈ ఘటనకు ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే....గత నాలుగు సంవత్సరాల క్రితం పెండ్లిమర్రి మండలం దర్బారుపేటకు చెందిన అమీరున్ను హరీంద్రనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా వివాహమాడాడు. వీరికి మూడు సంవత్సరాల చిన్నారి సమీర ఉంది. ప్రస్తుతం అమీరున్ ఐదు నెలల గర్భిణి. గత కొద్ది నెలల నుంచి ఇరువురి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. అమీరున్‌పై భర్త అబ్దుల్లాకు అనుమానం మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున 6.30–7.00 గంటల మధ్య అమీరున్ ఇంటి వద్ద వంట సామగ్రిని శుభ్రం చేస్తుండగా వెనుక వైపు నుంచి అబ్దుల్లా రోకలిబడెతో తలపై రెండు మార్లు మోదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రూరల్ సీఐ వెంకట శివారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ కుళ్లాయప్ప సంఘటనానికి చేరుకున్నారు. నిందితుడి గురించి గ్రామంలో విచారించారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా గాలింపులు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుళ్లాయప్ప తెలియజేశారు.