AP: ‘కొప్పర్తి’ పరిశ్రమలకు అన్నీ చౌకే | APIIC Focus On Kopparthy Branding And YSR EMC | Sakshi
Sakshi News home page

AP: ‘కొప్పర్తి’ పరిశ్రమలకు అన్నీ చౌకే

Published Tue, Sep 14 2021 2:15 PM | Last Updated on Tue, Sep 14 2021 2:15 PM

APIIC Focus On Kopparthy Branding And YSR EMC - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు బ్రాండింగ్‌పై ఏపీఐఐసీ దృష్టిసారించింది. కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ (వైఎస్సార్‌జేఎంఐహెచ్‌), వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ఈఎంసీ)లలో భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వీటి ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించింది. కొప్పర్తి పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గుతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, అభివృద్ధి చేస్తున్న మౌలికవసతులు వంటి విషయాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించింది. 

నాలుగు విధాలుగా తగ్గనున్న వ్యయం
దేశంలోని ఇతర పారిశ్రామిక పార్కులతో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు నిర్వహణ వ్యయం భారీగా తక్కువగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ఇతర రాష్ట్రాల కంటే చౌకగా భూమి, విద్యుత్, నీరుతో పాటు చౌకగా కార్మికులు అందుబాటులో ఉన్న విషయాన్ని ఏపీఐఐసీ గణాంకాలతో వివరించింది. దేశంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో సగటున ఎకరం ధర రూ.85 లక్షలు ఉంటే ఇక్కడ రూ.25 లక్షలకే కావాల్సినంత భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల పెట్టుబడిలో భూ వ్యయం 64 శాతం తగ్గనుంది.

అదేవిధంగా యూనిట్ల నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్‌ను కూడా చౌకగా అందిస్తోంది. దేశంలో సగటు పారిశ్రామిక యూనిట్‌ ధర రూ.8.2గా ఉంటే వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో 21 శాతం తక్కువగా యూనిట్‌ రూ.5.5కే అందిస్తున్నారు. అదే వైఎస్సార్‌ఈఎంసీలో అయితే యూనిట్‌ రూ.4.5కే ఇస్తున్నారు. అంటే దేశ సగటుతో పోలిస్తే 45 శాతం చౌకగా వైఎస్సార్‌ఈఎంసీలో విద్యుత్‌ను అందిస్తున్నారు.

దేశంలో సగటున కిలోలీటరు నీటిని రూ.70కి ఇస్తుంటే 24 గంటలు కావాల్సినంత నీటిని గండికోట రిజర్వాయర్‌ నుంచి రూ.55కే ఇస్తున్నారు. దీనివల్ల నీటి నిర్వహణ వ్యయం 15 శాతం తగ్గనుంది. దేశంలో సగటున కార్మికులకు నెలకు రూ.8,500  కూలి లభిస్తుంటే ఇక్కడ రూ.7,500కు కావాల్సినంతమంది అందుబాటులో ఉన్నారు. ఈ నాలుగు అంశాలే పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించనున్నాయని ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు.

కలిసొచ్చే అంశాలు 6..
కొప్పర్తి పారిశ్రామికవాడలో పెట్టుబడులకు మరో ఆరు అంశాలు కలిసివస్తాయని ఏపీఐఐసీ ఆ పుస్తకంలో పేర్కొంది. పూర్తిగా పర్యావరణ అనుమతులు పొందిన 6,914 ఎకరాలు అందుబాటులో ఉండటం, నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకునే విధంగా రెడీ టు బిల్డ్‌ షెడ్లతో పాటు రోజుకు 46 ఎంఎల్‌డీ నీరు, 132 కేవీ సబ్‌స్టేషన్, 2.6 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం, ఆరు, నాలుగు, రెండు లైన్ల రహదారులు వంటి అనేక మౌలికవసతులు కల్పిస్తున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే 50 వేలమందికిపైగా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కార్గో సర్వీసుల కోసం ప్రత్యేక టెర్మినల్‌ కలిసొచ్చే అంశం.

వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో ఇతర ప్రయోజనాలు
ఇవేగాకుండా వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఇన్వెస్ట్‌చేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వైఎస్సార్‌ ఎంఐహెచ్‌ పాలసీ–2020–23ని విడుదల చేసింది. అలాగే వైఎస్సార్‌ ఈఎంసీలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించే యూనిట్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
100 శాతం స్టాంప్‌/ట్రాన్సఫర్‌ డ్యూటీ తిరిగి చెల్లింపు
► ప్రాజెక్టు విలువలో 20 శాతం చొప్పున గరిష్టంగా రూ.10 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ
► అదే మైనార్టీలు అయితే 25 శాతం చొప్పున గరిష్టంగా రూ.25 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ
► సరుకు రవాణా వ్యయంలో 25 శాతం చొప్పున ఏడాదికి రూ.50 లక్షల వరకు.. ఐదేళ్లు ఇస్తారు
► ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ చొప్పున ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు చెల్లింపు
► ఐదేళ్లపాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌ సబ్సిడీ
► ఎనిమిదేళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement