ఇండ్రస్టియల్ లాజిస్టిక్ పార్క్ నమూనా
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆంగ్లియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐడీపీఎల్) సిద్ధమవుతోంది.
విశాఖ ఎన్టీపీసీ సమీపంలో భారీ హబ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే విశాఖపట్నంలో లాజిస్టిక్ ఎఫిషియన్సీ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రాం (లీప్) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో లాజిస్టిక్ పార్క్‌ను నిర్మించాలని భావిస్తోంది. తాజాగా ఏఐడీపీఎల్ ఇక్కడ ఇండ్రస్టియల్ కమ్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు విస్తరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు మధ్య ఎన్టీపీసీకి సమీపంలో సుమారు 110 ఎకరాల్లో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రెండు పోర్టులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది.
చదవండి: (అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు)
ఇందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. స్టార్టప్‌లు, ఇతర పరిశ్రమలకు ఇందులో లీజుకు లేదా పూర్తి హక్కులతో స్థలాలను ఇస్తారు. ఈ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి, వాటికి అవసరమైన వస్తువుల దిగుమతులకు ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా.. పక్కనే లాజిస్టిక్ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. సమీపంలో ఫార్మా సిటీ కూడా ఉండటంతో.. ఫార్మా ఉత్పత్తుల నిల్వకు మెగాసైజ్ కోల్డ్ చైన్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ పార్క్‌లో మౌలిక వసతులతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు ఏఐడీపీఎల్ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆంగ్లియాన్ గ్రూపు ప్లగ్ అండ్ ప్లే విధానంలో వేర్‌హౌస్, కోల్డ్ చైన్‌లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2030 నాటికి దేశంలోనే అతి పెద్ద వేర్ హౌస్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు విశాఖపట్నం తరహా నగరాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఎలక్ట్రికల్ లాజిస్టిక్ రంగంలో ఆంగ్లియాన్ ఒమేగా పేరుతో ఒక టన్ను బరువును మోయగలిగే బ్యాటరీతో నడిచే ఆటోలను ఉత్పత్తి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment