ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి?
నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది?
ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది?
పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి?
విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా?
ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా?
మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా?
ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా?
మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్‌కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?)
అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?)
– కళింగ కరువోడు
Comments
Please login to add a commentAdd a comment