రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్‌లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు.
విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు.
అమరావతి యాత్ర ఆపేయాలి
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది.
– లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్
టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే.
– బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం
పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి
విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి.
– బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి
ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి
అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్
జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం
ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం.
– గుడివాడ అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
తొడలు కొట్టడం సంస్కారమా?
ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.
– దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి
అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది.
– భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ
ఉద్యమం ద్వారానే సాధించుకుందాం
రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి.
– జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం)
Comments
Please login to add a commentAdd a comment