వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో అల్‌డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముగిసిన మూడ్రోజుల పర్యటన
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు.
సంస్థల వివరాలు..
– అల్ డిక్సన్ టెక్నాలజీస్..
అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు.
తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది.
వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్..
2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
టెక్నోడోమ్ సంస్థ..
అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది.
ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ..
రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్‌లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది.
ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్‌సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్‌బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment