సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్‌లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్‌షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది.
దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment