భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి.
యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్‌ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు.
అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment