సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు.
ఎంఎస్‌ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్‌ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు.
రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్‌ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు.
వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు.
విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్
ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు.
రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు
విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్‌ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు.
నాలుగేళ్లలో వృద్ధి బాగుంది
– స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ
– గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట
– 2021–22లో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది
– 2022–23లో జీఎస్‌డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది.
– ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ
– జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల.
– 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక.
– 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి.
– 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల.
Comments
Please login to add a commentAdd a comment