సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం
పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు.
విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment