ఆహార శుద్ధి పరిశ్రమలకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం
పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 యూనిట్లు
తొలిదశలో రూ.1,250 కోట్లతో 10 యూనిట్లు
రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు
వీటి కోసం 322.61 ఎకరాలు సిద్ధం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పం..
రూ.వెయ్యి కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన సిడ్బీ
ఈ రుణం మాకొద్దని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
ల్యాండ్ బ్యాంక్‌పై కన్నేసిన టీడీపీ ప్రభుత్వంలోని కీలక నేతలు
అందుకే ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు నిరాకరణ!
సాక్షి, అమరావతి: చెప్పేదొకటి.. చేసేది మరొకటి. పైకి పరిశ్రమలు తెస్తామంటారు.. వస్తున్న పరిశ్రమలకూ మోకాలడ్డుతారు. వాటి కోసం కేటాయించిన స్థలాలను లాగేసుకోవడం ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల కుతంత్రాలివి. ఇందుకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటున్న వైనమే ఇందుకు తార్కాణం.
ఈ పరిశ్రమల కోసం రుణాలిస్తానన్న బ్యాంకుకు తమ ‘పాలసీ’మారిందని, రుణం అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వీటికోసం జిల్లా కేంద్రాలకు సమీపంలో సేకరించిన విలువైన భూములపై టీడీపీ పెద్దలు కన్నేసినందునే ప్రభుత్వ ‘పాలసీ’ మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ కల్పించడం ద్వరా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది.
పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 ఆహార శుద్ధి యూనిట్లు, రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తొలుత రెండు దశల్లో రూ.1,250 కోట్లతో 10 ఆహార శుద్ధి యూనిట్లు, 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం జిల్లా కేంద్రాలకు సమీపంలోనే 322.61 ఎకరాలు సమీకరణ చేసి లాండ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసింది.
115 కంపెనీలు ఆసక్తి
ఈ పరిశ్రమల ద్వారా వచ్చే 15 ఏళ్లలో పన్ను రూపంలో రూ. 9వేల కోట్ల రాబడితో పాటు జీడీపీ 1,500 కోట్లకుపైగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే స్వయంగా వీటిని నిర్మించి ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు 15 ఏళ్లకు లీజు పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ముడి సరుకును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల ద్వారా కొనాలని నిర్దేశించింది.
తొలి దశ ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు ఆపరేటర్ల ఎంపిక కోసం టెండర్లు పిలవగా హల్దీరామ్స్, ఐటీసీ వంటి 115 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. వీరికి ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో ఇవ్వాలని సంకల్పించింది. తొలిదశ యూనిట్ల ఏర్పాటు కోసం సిడ్బీ రూ.1,000 కోట్లు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా విడుదల చేసింది.
ఫేజ్–1లో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద రూ.72.47 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్‌తో పాటు ఒక్కొక్కటి రూ.5 కోట్ల అంచనాతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గతేడాది అక్టోబర్‌లో శ్రీకారం కూడా చుట్టారు. ఇలా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైన తరుణంలో వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాము ఈ పాలసీని పునః సమీక్షిస్తున్నామని, రుణం అవసరం లేదంటూ బ్యాంకుకు చెప్పేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారింది.
రూ.1,000 కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న కుట్రతోనే..
ఆహార శుద్ధి పరిశ్రమలకు జిల్లా కేంద్రాల సమీపంలో సమీకరించిన విలువైన భూములపై టీడీపీ బడా నేతల కన్ను పడినందునే వీటి ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీపీపీ మోడ్‌లో ఇచ్చే పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూములను కొట్టేయాలని కుతంత్రం పన్నినట్లు సమాచారం. ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేయించి, బహుళ జాతి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి తూట్లు పొడిచి ఆ స్థలాల్లో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
యూనిట్లు ఏర్పాటు ఇలా..
తొలిదశ : ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్ల లోపు
వేరుశనగ – అనంతపురం
కాఫీ – అరకు
మామిడి తాండ్ర – కాకినాడ
బెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీ –
అనకాపల్లి కందులు – గుంటూరు, ఒంగోలు
వీటితోపాటు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు
రెండో దశ: ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్లకు పైబడ్చి
అరటి – పులివెందుల
టమాటా – నంద్యాల
పండ్లు, కూరగాయలు – రాజంపేట
సుగంధ ద్రవ్యాలు – నరసరావుపేట
Comments
Please login to add a commentAdd a comment