సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని వెలకట్టలేని సంపదగా భావిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి అనుకూలతగా మార్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదచల్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న పోర్టుల పక్కన పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది.
ముందుగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొత్త సంవత్సరంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో పోర్టు అందుబాటులోకి రానుండటంతో రామాయపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును ఏపీమారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తోంది. పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు ఎండీ, సీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరు గ్రామంలో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది.
జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ ఈ ఏడాది చివరినాటికి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టీపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, ఒక మల్టీపర్పస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది.
పోర్టు పక్కనే కార్గో ఎయిర్ పోర్ట్
కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో కార్గో ఆధారిత ఎయిర్‌పోర్టు నిర్మాణంపైన కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన దగదర్తి స్థానంలో కార్గో ఆధారిత విమానాశ్రయాన్ని రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెట్టు వద్ద అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కి తూర్పువైపు పోర్టు ఉంటే, పడమర వైపు ఎయిర్‌పోర్టు ఉండే విధంగా డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment