వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో సీఎం ప్రారంభించనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఈఎంసీ ప్రధాన ముఖద్వారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక దశ, దిశను మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. తక్షణం వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా అభివృద్ధి చేసిన షెడ్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన ఈ రెండు పారిశ్రామిక పార్కులను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఈఎంసీలో దాదాపు 28 యూనిట్లు రూ.1,052 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటి ద్వారా సుమారు 14,100 మందికి ఉపాధి లభించనుంది. కొప్పర్తిలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను ఉత్పత్తి ప్రారంభించడం కోసం ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ యూనిట్లో సెక్యూరిటీ సర్వైలైన్స్ సిస్టమ్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను అభివృద్ధి చేయనుంది.
ఇక్కడ ఏర్పాటయ్యే మరికొన్ని కంపెనీలు
► డిక్సన్.. 1200 మందికి ఉద్యోగాల కల్పన. టీవీలు, ల్యాప్‌టాపులు, ఐఓటీ పరికరాల తయారీ.
► సెల్‌కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్.. 1500 మందికి ఉద్యోగాలు. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ హ్యాండ్‌సెట్లు, ట్యాబ్‌లెట్లు, పీసీ యాక్ససరీలు, సెట్‌టాప్ బాక్సులు, గిగాబైట్ ఎథర్నెట్ ఆప్టికల్ నెట్‌వర్క్ (జీపీఓఎన్) తయారీ.
► ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్ ప్రైజస్.. 1,300 మందికి ఉద్యోగాలు. పవర్ బ్యాంక్స్, కేబుల్స్, చార్జర్లు, హెడ్‌ఫోన్స్, డిజిటల్ బోర్డుల తయారీ.
► యూటీఎన్‌పీఎల్ కంపెనీ.. 500 మందికి ఉద్యోగాలు.. మొబైల్ ఫోన్లు, చార్జర్లు, తదితర పరికరాల తయారీ.
► వీవీడీఎన్ టెక్నాలజీస్.. రూ.365 కోట్ల పెట్టుబడితో 5,400 మందికి ఉద్యోగాలు. 5జీ, ఏఐ, ఎంఐ, బ్లాక్ చెయిన్, బిగ్ డేటా, అనలిటిక్స్ రంగంలో ఉత్పత్తులు.
► బ్లాక్ పెప్పర్, హార్మనీ కంపెనీలు.. రూ.1800 కోట్ల పెట్టుబడులతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు.
► ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు కూడా ప్రాధాన్యత. రూ.84.29 కోట్లతో 18 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు. భూములు అప్పగింత ద్వారా ఈ యూనిట్ల పనులు ప్రారంభం కానున్నాయి.
► ఇండస్ట్రియల్ ప్రమోషన్‌తోపాటు, ఈఎంసీలో పెట్టుబడులకు అవకాశాలను తెలియజెప్పడం ద్వారా కంపెనీలను ఆకర్షించడానికి తైవాన్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, బిజినెస్ రష్యా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంఎస్‌ఎంఈ, ఎల్‌సీనా, ఐఈఎస్‌ఏ, ఐపీసీఏ, సీపీపీఏలతో ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment