![Railway line to Kopparthi Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/17/TRACK-7..jpg.webp?itok=71XEKgsl)
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను అనుసంధానిస్తూ కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తోంది. కొప్పర్తికి సమీపంలోని కృష్ణాపురం రైల్వే స్టేషన్ నుంచి కొప్పర్తి వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌ను అనుసంధానిస్తూ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేయనున్నారు.
పీఎం గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) పథకం కింద ఈ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సృజన తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కు నుంచి సులభంగా సరుకు ఎగుమతి, దిగుమతి చేసుకునేలా కృష్ణాపురం ప్రధాన లైన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ప్రత్యేక లైన్ నిర్మిస్తారు. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
పారిశ్రామిక పార్కులో నిర్మించే గోడౌన్లను సైడింగ్ లైనుతో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రధాన లైన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా సరుకు రవాణా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్‌కు ఏపీఐఐసీ టెండర్లును ఆహ్వానించింది. కొప్పర్తిలో ఈ రైల్వే సైడింగ్‌తో పాటు రూ.100.18 కోట్లతో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా, రూ.21 కోట్లతో అభివృద్ధిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేంద్రానికి త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment