కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ | Huge Textile Park in YSR District Kopparthi | Sakshi
Sakshi News home page

కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌

Published Fri, Nov 12 2021 3:51 AM | Last Updated on Mon, Feb 21 2022 12:46 PM

Huge Textile Park in YSR District Kopparthi - Sakshi

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్రమంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని.. అక్కడ భారీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రికి గౌతమ్‌రెడ్డి గురువారం పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో ఒకటి కొప్పర్తిలో ఏర్పాటుచేయాలన్నారు. 

విద్యుత్‌ ఉపకరణాల తయారీకి మన్నవరం అనుకూలం 
అలాగే, భారీ విద్యుత్‌ ఉపకరణాల యూనిట్‌ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా మన్నవరం అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేకపాటి కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి చొరవతో 2008లో ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌తో కలిసి మన్నవరంలో విద్యుత్‌ ఉపకరణాల యూనిట్‌ను ఏర్పాటుచేశారని.. ఇందుకోసం ఏపీఐఐసీ 750 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గోయల్‌ దృష్టికి గౌతమ్‌రెడ్డి తీసుకొచ్చారు. కానీ, బీహెచ్‌ఈఎల్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో 2015 నుంచి ఈ యూనిట్‌ మూతపడి ఉందని.. దీనిని భారీ విద్యుత్‌ ఉపకరణాల తయారీ జోన్‌కు పరిశీలించాలని కూడా కోరారు. కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం కింద దేశంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు భారీ విద్యుత్‌ ఉత్పత్తి ఉపకరణాల జోన్లలో ఒకటి మన్నవరంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీయుష్‌ గోయల్‌.. త్వరలోనే ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.  

రైల్వే కారిడార్‌ను ఏపీలోనూ చేపట్టాలి 
ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతం ఏడీబీ 80, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతంగా ఉందని.. రాష్ట్ర వాటాను 10 శాతానికి తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరారు. అలాగే, రక్షణ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న రైల్వే కారిడార్‌ను రాష్ట్రంలో కూడా చేపట్టాల్సిందిగా మేకపాటి విజ్ఞప్తి చేశారు. దీనిపై గోయల్‌ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గతిశక్తి మిషన్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకోవచ్చని సూచించారు. త్వరలో విశాఖపట్నం మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటుచేసిన మెడక్సిల్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పీయూష్‌ గోయల్‌ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ  సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా, మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement