
సాక్షి, అమరావతి: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ‘మీకు ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలో చెప్పండి. మేమే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని సమకూరుస్తాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ వివిధ కంపెనీలకు ఆహ్వానం పలికారు. స్థానిక యువతకు పారిశ్రామిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. వారిని మెరికల్లా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచన మంచి సత్ఫలితాలిస్తోంది. 7 నెలల కాలంలోనే 4,413 మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉపాధి పొందడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సంయుక్తంగా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి.
పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా..
పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా వివిధ సంస్థలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని పరిశ్రమల శాఖ గుర్తించగా.. దానికి అనుగుణంగా ఏపీ ఎస్‌ఎస్‌డీసీ కోర్సులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ పోగ్రాం (ఐసీఎస్‌టీపీ)ను ఏపీ ఎస్‌ఎస్‌డీసీ నిర్వహిస్తోంది. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో వారికి కావాల్సిన కోర్సులకు అనుగుణంగా ఐసీఎస్‌టీపీ నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఐసీఎస్‌టీపీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 276 కంపెనీలు ముందుకు రాగా.. అందులో ఇప్పటికే 156 కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణ తరగతుల ద్వారా యువతకు అందించి ఉపాధి కల్పించినట్టు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ అధికారులు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వివరించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధంగా మొత్తం 4,413 మందికి శిక్షణ ఇవ్వగా.. కోర్సు పూర్తి చేసిన వెంటనే వారందరికీ ఆయా సంస్థలు నేరుగా ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు.
వివిధ సంస్థలకు ఇలా..
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాంగ్నిజెట్, కియా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, రాంకీ ఫార్మా, నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి అవసరమైన కోర్సుల్లో ఏపీఎస్‌ఎస్‌డీసీ యువతకు శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు, ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్‌వేర్ ట్రైనీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బిజినెస్ ఎనలిస్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా కోర్సులు పూర్తి చేసి ఉపాధి పొందిన వారికి ప్రారంభ వార్షిక వేతనం కనిష్టంగా రూ.2 లక్షల వరకు ఉంటోందని ఏపీ ఎస్‌ఎస్‌డీసీ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment