రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్‌టైల్‌తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు.
అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment