సమీక్షలో మాట్లాడుతున్న కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్, చిత్రంలో ఎంపీ సత్యవతి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన.
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా.. ఈ అంశంలో
మరో కీలక ముందడుగు పడింది. రాష్ట పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్‌పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా.. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరై కారిడార్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన రాష్ట్రంలో కారిడార్లు, నోడ్స్‌లో పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు.
నిధులు త్వరితగతిన ఇచ్చేందుకు హామీ
ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన 51 శాతం పనులను ఇప్పటికే పూర్తి చేశామని.. కేంద్రం వాటా 49 శాతం నిధుల్ని గ్రాంట్ రూపంలో కేటాయించాలని పరిశ్రమల శాఖ అధికారులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సోమ్‌ప్రకాష్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా 11 కారిడార్లు, 32 పారిశ్రామిక నోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఇందులో 5 నోడ్స్‌ను ఏపీకి కేటాయించామన్నారు. కారిడార్లు, నోడ్స్‌కు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను జూన్ నాటికి సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు.
కేంద్రం నుంచి రావాల్సిన వాటా రూ.4 వేల కోట్లను త్వరితగతిన కేటాయించేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అన్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్స్‌తోపాటు ఎగుమతులకు ఎక్కువ అవకాశాలుండే పరిశ్రమలపై దృష్టి సారించాలన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. జనావాసాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీలకు భూకేటాయింపులు తగ్గించేలా చూడాల, వీలైనంత త్వరగా గ్రాంట్ కేటాయించి రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్ల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment