
శ్రీసిటీలో టోరాయ్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఫైల్)
శ్రీసిటీ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చిత్తూరు జిల్లాలోని సత్యవేడు రిజర్వ్ ఇన్‌ఫ్రా సిటీ (శ్రీసిటీ)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త ఇక్కడి పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీసిటీతో గౌతమ్‌రెడ్డికి మంచి అనుబంధం ఉంది. గడచిన రెండేళ్లలో పలుసార్లు శ్రీసిటీని సందర్శించిన ఆయన పారిశ్రామికాభివృద్ధికి విశేష సహకారం అందించారు.
కోవిడ్ కష్టకాలంలో ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 2020 ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన భారీ పరిశ్రమ టోరె ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన జపాన్ ప్రతినిధులతో సమావేశమై మరిన్ని పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చేలా ఒప్పించారు. తరచూ వర్చువల్ విధానంలో ఇక్కడ పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ వారి సమస్యలను పరిష్కరించేవారు. మంత్రిగా, స్నేహితుడుగా పరిశ్రమల సీఈవోలకు ప్రత్యక్షంగాను, ఫోన్‌లోను అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందారు.
శ్రీసిటీకి తీరనిలోటు
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర పారిశ్రామిక వర్గానికి, ముఖ్యంగా శ్రీసిటీకి తీరని లోటు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి, ప్రత్యేకించి కరోనా సమయంలో పరిశ్రమల పునః ప్రారంభానికి ఆయన అందించిన సహకారం ఎంతో విలువైనది.
– రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్