సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఈ విషయంలో గతంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని వెళ్లాలని కోరారు. ఇప్పటిదాకా ఉద్దీపన ప్యాకేజీని ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదని, రాష్ట్రాల్లో విపక్ష, స్వపక్ష ప్రభుత్వాలు అనే తేడా లేకుండా మేకిన్ ఇండియా నినాదాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక 2020–21ను మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు.
జాతీయ సగటు కంటే తెలంగాణ ఉత్తమం
►ఏడేళ్లలో 20కిపైగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి రప్పించాం.
►ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏడాది కాలంలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం.
►గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 810 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 10 పారిశ్రామిక పార్కుల్లో రూ. 6,023 కోట్ల పెట్టుబడులతో 453 పరిశ్రమలు, 7,623 ఉద్యోగాలు వచ్చాయి.
సాక్షి, హైదరాబాద్: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) మెరుగ్గా ఉందని, 2020–21లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ. 9.78 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా 1.26 శాతం జీడీపీ తగ్గినా జీడీపీతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా ఏకంగా 20.9 శాతం పెరగ్గా జాతీయ స్థాయిలో కేవలం 3 శాతమే పెరిగిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగం జీఎస్‌డీపీకి ఈ స్థాయిలో వాటా అందించడం ఇదే తొలిసారన్నారు. ఇక జీడీపీలో తెలంగాణ ఆర్థిక రంగం 26 బేసిస్ పాయింట్లు పెరిగి 2020–21లో 5 శాతానికి చేరిందని చెప్పారు. 2019–20లో ఇది కేవలం 4.74 శాతంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. అలాగే తలసరి వార్షిక ఆదాయంలో జాతీయ సగటు రూ. 1,27,768 కాగా తెలంగాణలో రూ. 2,27,145గా ఉందన్నారు. 2020–21 గ్రాస్ స్టేట్ వ్యాల్యూ అడిషన్ (జీఎస్‌వీఏ)లో రంగాలవారీగా వ్యవసాయ రంగం 20.6 శాతం, పారిశ్రామిక రంగం 19.1 శాతం, సేవా రంగం 60.3 శాతం చొప్పున వాటా ఉందన్నారు.
ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ సొబగులు...
ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకు తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ టవర్లను ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది నల్లగొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ‘టీ–హబ్’రెండో దశ, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సౌకర్యం ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాదే ప్రారంభిస్తామని, ఎలక్టానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సాగునీటి రంగంతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ రంగం కూడా ఎంతో పురోగతి సాధించిందని, గతంలో 30 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.06 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. హైదరాబాద్ మినహా మిగతా పాత 9 జిల్లాల పరిధిలో 250 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సీఎం ఆదేశాల మేరకు ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు’ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
– ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల ఎగుమతుల్లో 2020–21లో 12.98 శాతం వృద్ధి రేటుతో ఐటీ ఎగుమతులు రూ. 1,45,522 కోట్లకు చేరగా ఉద్యోగుల సంఖ్యలో 7.99 శాతం వృద్ధి రేటుతో కొత్తగా 46,489 ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,489కి చేరగా, పరోక్షంగా హోటల్, టూరిజం, ఇతర సర్వీసు రంగాల్లో సుమారు 20లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
– ఎస్‌టీపీఐ, ఎస్‌ఈజడ్, నాస్కామ్ వంటి సంస్థల లెక్కల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ. 2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో 15.6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక రంగంలో కొత్తగా వస్తున్న పెట్టుబడుల్లో 80 శాతం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీల కార్యకలాపాల విస్తరణ వల్లే వచ్చాయి.
– ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ జాబితాలో మొదటి స్థానం, ఈఓడీబీలో 3వ స్థానం, నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో 4వ స్థానంలో నిలవడంతోపాటు ఐటీపీవో త్రీ స్మార్ట్ సిటీస్ అవార్డును హైదరాబాద్ గెలుచుకుంది. అమెజాన్ డేటా సర్వీసెస్, ఎన్‌పీసీఐ, వీఎస్‌ఈజెడ్, గోల్డ్‌మన్ సాష్ వంటి కంపెనీలు ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే దిక్సూచిగా పనిచేస్తు్తన్నాం. కరోనా మహమ్మారి సంక్షోభంలో జీనోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తోంది. జీనోమ్ వ్యాలీతోపాటు, పాలిస్టర్ ఫిల్మ్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. టీ–హబ్, టీఎస్‌ఐసీ, రిచ్, వి–హబ్ క్షేత్రస్థాయిలో ఇన్నోవేటర్లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు ఊతమివ్వడంలో అనూహ్యంగా పురోగతి సాధిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డ్రోన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి సరికొత్త టెక్నాలజీలో తెలంగాణ ముందంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment