త్వరలో ఆ పనులు షురూ
రెండు పారిశ్రామిక కారిడార్లపై డీఐపీపీ భేటీలో సీఎం వెల్లడి
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కారిడార్లపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్(డీఐపీపీ) శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజంటేషన్ ఇచ్చింది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కూడా వీటి పరిధిలో చేర్చాలని ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి డీఐపీపీకి సూచించారు.
విశాఖపట్నం-చెన్నై కారిడార్‌కు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ), చెన్నై-బెంగుళూరు కారిడార్‌కు జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) ఆర్థిక సాయం అందిస్తోందని డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. రెండు కారిడార్ల పరిధిలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, ఏర్పేడు-శ్రీకాళహస్తిని ముఖ్యమైన నోడ్లుగా గుర్తించి, అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)ను త్వరలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతామని అమితాబ్ చెప్పారు. ఆ సంస్థకు సీఆర్‌డీఏ పరిధిలో 100 ఎకరాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
చైనా బృందంతో ముఖ్యమంత్రి భేటీ
చైనాకు చెందిన శానీ గ్రూపు చైర్మన్ లియాంగ్ వెంగెన్ నేతృత్వంలో 20 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఆయనతో చర్చించింది. పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆఫర్లను చైనా ప్రతినిధులు తెలుసుకుని సానుకూలంగా స్పందించారు.
రేపు తిరుమలకు సీఎం :సీఎం చంద్రబాబు ఆదివారం తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఉదయం 9.45 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన కోసం టీటీడీ సేకరించిన ఏడు తీర్థాల పుణ్యజలం, ఏడు కొండల పుట్టమన్ను స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.