న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 12,548 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,665 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39,158 కోట్ల నుంచి రూ. 60,554 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,000 కోట్ల నుంచి రూ. 47,135 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 7.25 మిలియన్ టన్ను(ఎంటీ)ల నుంచి 7.77 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు మాత్రం 7.93 ఎంటీ నుంచి 7.39 ఎంటీకి వెనకడుగు వేశాయి. కాగా.. స్టాండెలోన్ నికర లాభం రూ. 2,539 కోట్ల నుంచి రూ. 8,707 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 21,820 కోట్ల నుంచి రూ. 32,964 కోట్లకు జంప్‌చేసింది.
నాట్‌స్టీల్ విక్రయం..: సింగపూర్ అనుబంధ సంస్థ నాట్‌స్టీల్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. దేశీ బిజినెస్‌తోపాటు.. యూరోపియన్ కార్యకలాపాలు సైతం పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అయితే బొగ్గు ధరలు, ఇంధన వ్యయాల కారణంగా భవిష్యత్‌లో మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. 5 ఎంటీ వార్షిక సామర్థ్యంతో చేపట్టిన కళింగనగర్ రెండో దశ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ బీఎస్‌ఎల్ విలీనాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇటీవలే అధిక నాణ్యతగల గంధల్‌పాడ ఇనుపఖనిజ గనులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రూ. 11,424 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 1,299 వద్ద ముగిసింది.
రూ. 1,324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
క్యూ2లో టాటా స్టీల్ జోరు
Published Fri, Nov 12 2021 5:04 AM | Last Updated on Fri, Nov 12 2021 5:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment